Begin typing your search above and press return to search.

కాదేదీ ఈ వైసీపీ నేత దోపిడీకి అనర్హం

By:  Tupaki Desk   |   10 Dec 2019 3:24 PM GMT
కాదేదీ ఈ వైసీపీ నేత దోపిడీకి అనర్హం
X
ఏపీలో ఇప్పుడు ఇసుకే కాదు.. మట్టి కూడా బంగారమైంది. ఇళ్ల నిర్మాణాలకు మట్టి నిత్యావసరంగా మారింది. దీంతో ఈ మట్టిని అక్రమంగా కొల్లగొడుతూ కొందరు నేతలు అక్రమార్జన చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ అధికార పార్టీ నాయకుడి అనుచరుడు ప్రభుత్వం పేరు చెప్పి విచ్చలవిడి దోపిడీకి తెరతీశాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. వైసీపీ సర్కారును అభాసుపాలు చేస్తున్నాడని వైసీపీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.. ప్రశ్నించి మట్టి తవ్వకాలు ఆపిన అధికారులను బదిలీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఇప్పుడు గృహ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ ప్లాట్లను చదును చేయడానికి మట్టి అవసరం విపరీతంగా ఉంది. దీంతో మార్కెట్లో మట్టి కొరతను క్యాష్ చేసుకోవడానికి అధికార వైసీపీ పార్టీ నేత ఆలోచించాడని.. తన అనుచరుడిని మట్టి సరఫరాపై నియంత్రణకు ప్రతినిధిగా నియమించాడని మార్కాపురం స్థానికులు ఆరోపిస్తున్నారు.

మార్కాపురంలో ఇప్పుడు మట్టి దందాకు సదురు అధికార పార్టీ నేత అనుచరుడు తెరలేపాడు. టిప్పర్ కు 300, ట్రాక్టర్ కు రూ.80 లు చొప్పున దందా మొదలుపెట్టాడట.. ప్రభుత్వ ప్రజల ఆస్తులైన చెరువులు, కుంటల నుంచి అధికార అండతో అక్రమంగా మట్టిని తీస్తూ అవసరమైనవారికి సరఫరా చేస్తూ లక్షలు కొల్లగొడుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మార్కాపురం శివారు చెరువులు, కుంటల నుంచి 700 ట్రిప్పులు కొల్లగొట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

మార్కాపురంలో వైసీపీ నేత అనుచరుడి మట్టిదందా విశృంఖలంగా సాగడంతో కొందరు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువులు, కుంటల్లో మట్టి సరఫరాపై అధికారులు నిఘా వేసి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. అయినా రాత్రి వేళల్లో ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తమ మట్టి దందాకు అడ్డుతగులుతున్న అధికారులకు సదురు వైసీపీ నేత వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. సెలవుపైనైనా వెళ్లండని.. లేదంటే మేం చెప్పింది చేయండని బెదిరించినట్టు తెలిసింది. అధికారులను బెదిరించి మరీ మట్టి రవాణా చేయిస్తున్న అధికార వైసీపీ నేత వ్యవహారం వైసీపీ సర్కారులో చర్చనీయాంశంగా మారింది.