జగన్ పంతం : శ్రీకాకుళం ఎలాగైనా దక్కించుకోవాలి

Mon May 16 2022 12:06:17 GMT+0530 (IST)

YSJagan on Capturing Srikakulam

శ్రీకాకుళం ప్రాంతం మొత్తం మళ్లీ తనతోనే ఉంచుకునేలా వ్యూహరచన చేస్తున్నారు జగన్. రాష్ట్రంలో ఎంతో సెంటిమెంట్ ఉన్న ప్రాంతంగా ఉత్తరాంధ్రకు గుర్తింపు. అందుకే జగన్ కొన్ని ప్రణాళికలు వేస్తున్నారు.  ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావుకు ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా కొన్ని కీలక పదవుల్లో ఉత్తరాంధ్ర నేతలకు స్థానం ఇచ్చారు.తమకు పొలిటికల్ పిల్లర్ గా చెప్పుకునే టీడీపీని ఢీ కొనేందుకు జగన్ వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగానే ఈ ప్రాంత మహిళా నేతలనూ ఎంతగానో ప్రోత్సహిస్తూ వస్తున్నారు .ఆ కోవలో ఆ తోవలో జెడ్పీ చైర్మన్ పదవి మహిళకే కేటాయించారు. పిరియా విజయ పేరును ఖరారు చేశాక పార్టీలో ఉన్న అసంతృప్త వాదులు మాట్లాడకుండా ఉండేందుకు ఇంకొన్ని ఈక్వేషన్లతో సర్దుబాటు చేశారు.

వాస్తవానికి ముందు నుంచి పిరియా విజయ పేరు లేదు. కానీ ఆఖరి నిమిషాన ఆమె పేరు (ఆమె భర్త పిరియా సాయిరాజు ఒకప్పటిఇచ్ఛాపురం ఎమ్మెల్యే) వినవచ్చింది. ఆ విధంగా సాయిరాజు అనే ఓ వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన నేతకు గౌరవం ఇచ్చారు.

సాయిరాజు కాళింగ సామాజిక వర్గం నేత. భార్య మాత్రం వేరే సామాజికవర్గంకు చెందిన వారు. కులాంతర ప్రేమ వివాహం కావడంతో అనూహ్యంగానే ఆమెకు పదవి వరించింది. కవిటి జెడ్పీటీసీ ఎన్నికయిన వెంటనే ఆమెకు ఈ వరం అధిష్టానం నుంచి వచ్చింది.  

ఇక ఎమ్మెల్సీ పదవుల కేటాయింపుల్లో కూడా చాలా పోటీనే వచ్చినా దువ్వాడ శ్రీనుకే అవకాశం ఇచ్చారు. ఆ విధంగా ఆయన సిక్కోలుకే ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవానికి ఉత్తరాంధ్రలో కాళింగ తరువాత కోమటి సామాజికవర్గం మొదట నుంచి జగన్ తో ఉంది. మరి వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా కాళింగులకే ఎందుకు ఇచ్చారంటే టెక్కలిలో పార్టీ తరఫున బలీయమైన గొంతు వినిపిస్తున్నందుకే శ్రీనును ఎంపిక షురూ చేశారు.

వివాదాల తీరు ఎలా ఉన్నా విపక్ష నేత అచ్చెన్నను ఆయన  ఢీ కొంటున్నారు. శక్తి వంచన లేకుండా ఢీ కొని వివాదాలు కోరి కోరి తెచ్చుకుంటున్నారు. శ్రీనుకు అతి ఆవేశం ఉన్నా కూడా జగన్ మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ విధంగా శ్రీకాకుళం కాళింగులకు మంచి పదవులే ఇచ్చారు.ఆ కోవలో స్పీకర్ సీతారాం కూడా ఉన్నారు. తాజాగా ఇప్పుడిదే సామాజికవర్గానికి చెందిన కిల్లి కృపారాణికి మరో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అధి నాయకులు. రాజ్యసభ సభ్యురాలిగా ఆమెను ఎంపిక చేయనున్నారు.