వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ అరెస్టు

Tue Aug 03 2021 22:44:28 GMT+0530 (IST)

Sunil Yadav arrested in Viveka murder case

ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ హత్య కేసులో పులివెందులకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సునీల్ యాదవ్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు మంగళవారం అరెస్టు చేయడం సంచలనమైంది..సీబీఐ అధికారులు సోమవారం గోవాలో సునీల్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా సీబీఐ దీన్ని అధికారికంగా బుధవారం ధృవీకరించింది. సీబీఐ అధికారులు అతడిని ఉదయం గోవాలోని స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ పొందారు.అనంతరం కడపకు తీసుకువస్తున్నారు బుధవారం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు.

మార్చి 15 2019న జరిగిన వివేకానంద రెడ్డి హత్యలో ముగ్గురు ప్రధాన నిందితులలో సునీల్ యాదవ్ ఒకరు. మిగిలిన ఇద్దరు ఎర్ర గంగి రెడ్డి ఉమా శంకర్ అని సీబీఐ అనుమానిస్తోంది. ఈ మేరకు ఆధారాలు సేకరిస్తోంది.. హత్యకు సంబంధించి సీబీఐ అధికారులు వారిని అనేకసార్లు ప్రశ్నించగా వీరిపై అనుమానాలు బలపడ్డాయి.

సునీల్ యాదవ్ గతంలో రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీబీఐ తనను.. తన కుటుంబ సభ్యులను వేధిస్తోందని.. థర్డ్ డిగ్రీ హింసకు గురిచేస్తోందని పిటీషన్ లో ఆరోపించారు. తరువాత అతను తన కుటుంబ సభ్యులతో కలిసి పరార్ అయ్యాడు.

సీబీఐ ఇప్పటికే కడప జిల్లాలోని సునీల్ యాదవ్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించింది. ఆ తర్వాత అతను అనంతపురం వెళ్లి కదిరిలో మరో ఇద్దరిని కలిశాడని విచారణలో తేలింది. ఈ కేసులో అనుమానితులు కూడా విచారించడంతో సునీల్ యాదవ్ ఆచూకీ తెలిసింది. సునీల్ యాదవ్ గోవాలో తలదాచుకున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో అక్కడే అతడిని అరెస్ట్ చేసింది.