Begin typing your search above and press return to search.

వివేకా కేసును వేరే రాష్ట్రానికి బదిలీచేయాలా ?

By:  Tupaki Desk   |   13 Aug 2022 4:35 AM GMT
వివేకా కేసును వేరే రాష్ట్రానికి బదిలీచేయాలా ?
X
మాజీమంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును అవసరమైతే వేరే రాష్ట్రానికి బదిలీచేయాలని ఆయన కూతురు డాక్టర్ సునీత విజ్ఞప్తిచేశారు. వివేకా మర్డర్ కేసులో విచారణ తీరుపై ఆమె సుప్రింకోర్టుకు లేఖరాశారు. పైగా కేసు విచారణను డైరెక్టుగా సుప్రింకోర్టే పర్యవేక్షించాలని కూడా సునీత కోరారు. రాష్ట్ర హైకోర్టులోనే విచారణ జరిగితే దోషులను తేల్చటంలో జాప్యం జరుగుతోందని కూడా ఆమె తన అసంతృప్తిని వ్యక్తంచేశారు.

చాలాకాలంగా మర్డర్ కేసు విచారణ సా........గుతునే ఉందన్న సునీత వాదనలో ఎలాంటి తప్పులేదు. హత్యకేసుకు సంబందించిన సాక్ష్యాలను తుడిచేయటంలో కానీ సాక్ష్యులు అడ్డంతిరగటం అందరు చూస్తున్నదే. కేసు దర్యాప్తు మొదటినుండి రకరకాలుగా జరుగుతోంది.

దీంతో పులివెందుల కోర్టు తర్వాత జిల్లా కోర్టు ఇలా కిందకు మీదకు అవుతునే ఉంది. కేసు విచారణకు ఎంతో అవసరమైన సాక్షుల్లో ఇద్దరు ముగ్గురు చనిపోయారు. దాంతో కేసు దర్యాప్తులో కానీ కోర్టు విచారణలో కానీ లింకులు మిస్సవుతున్నాయి.

ఇదే సమయంలో సీబీఐ దర్యాప్తు విధానం కూడా అనుమానంగానే ఉంది. సునీత ఫిర్యాదుమీద చాలామంది మీద కేసులు పెట్టి విచారిస్తున్నది. నిందితుల్లో కొందరు వివేకా హత్యలో కూతురు సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి పాత్రకూడా ఉందని చేసిన ఫిర్యాదును మాత్రం సీబీఐ పట్టించుకోలేదు. దాంతో వాళ్ళు తన ఆరోపణలను కోర్టులో పిటీషన్ ద్వారా తెలియజేశారు. దాంతో కోర్టు సీబీఐకి ఇదే విషయమై నోటీసులిచ్చి తగిన సమాధానం చెప్పమని ఆదేశించింది.

వివేకాతో కూతురు, అల్లుడికి కూడా ఆస్తిపరమైన తగాదాలు చాలా జరిగాయని నిందుతులు చేస్తున్న ఆరోపణలను సీబీఐ ఎందుకు పట్టించుకోవటంలేదో అర్ధంకావటంలేదు. మొత్తానికి అనేక కారణాల వల్ల సీబీఐ దర్యాప్తు కానీ కోర్టులో విచారణ కానీ జరగాల్సినంత పారదర్శకంగా, వేగంగా జరగటంలేదన్నది వాస్తవం.

మరి సునీత కోరినట్లుగా సుప్రింకోర్టు డైరెక్టుగా పర్యవేక్షించటం సాధ్యమవుతుందా ? వేరే రాష్ట్రాలకు బదిలీచేయటం సాధ్యమవుతుందా అనేది చూడాలి.