‘నాలో..నాతో వైఎస్సార్’.. విజయమ్మ రాసిన పుస్తకం

Wed Jul 08 2020 10:45:37 GMT+0530 (IST)

YS Vijayamma Nalo Natho YSR Book Launch

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ఆయన భార్య వైఎస్ విజయమ్మ రాశారు. ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ శీర్షికతో రూపొందిన ఈ బయోగ్రఫీని వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.ఇప్పటికే వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ తోపాటు వైఎస్ కుటుంబ సభ్యులు వైసీపీ ముఖ్య నేతలు కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు.

ఈ పుస్తకంలో వైఎస్సార్ తో పెళ్లయిన సందర్భం నుంచి ఆయన వైవాహిక జీవితం.. పేదల కోసం డాక్టర్ గా వైఎస్సార్ వైద్యం చేయడం.. రాజకీయ రంగ ప్రవేశం పిల్లలు భక్తి మరణానంతరం ఎదురైన సమస్యలు.. జగన్ ప్రమాణ స్వీకారం వరకు జరిగిన ఘట్టాలను విజయమ్మ తన పుస్తకంలో వివరించారు.

వైఎస్సార్ ను దగ్గరి నుంచి చూసిన భార్యగా ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ అనే పుస్తకాన్ని రాసినట్లు వైఎస్ విజయమ్మ తెలిపారు. వైఎస్సార్ అభిమానులకు ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ గురించి రాబోయే తరాలు కూడా తెలుసుకొని స్ఫూర్తి పొందాలనే ఈ పుస్తకం రాసినట్లు వైఎస్ విజయమ్మ తెలిపారు. నేడు జగన్ చేతులమీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.

ఈ పుస్తకాన్ని ఎమ్మెస్కో పబ్లికేషన్ ముద్రించింది. అన్ని పుసక్తకేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు.