Begin typing your search above and press return to search.

అన్న విజయం మీద చెల్లెమ్మకు డౌటా...?

By:  Tupaki Desk   |   24 Sep 2022 10:00 AM GMT
అన్న విజయం మీద చెల్లెమ్మకు డౌటా...?
X
ఒక్కసారి కాదు ఏకంగా మూడు దశాబ్దాలకు పైగా ఏపీ సీఎం గా ఉండాలని, ఉంటానని వైఎస్ జగన్ గట్టిగా భావిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఎలాంటి మొహమాటాలకు పోలేదు కూడా. తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా అయన ఇప్పటికి నాలుగేళ్ల క్రితమే చెప్పేశారు. పాదయాత్ర వేళ జగన్ ఏపీలోని వాడవడాలా తిరుగుతూ ముప్పయ్యేళ్ళ పాటు ఏపీని పాలిస్తాను అని గట్టిగానే అంటూ వచ్చారు.

అంటే ఒక్కసారి కనుక జనాలు తనకు అవకాశం ఇస్తే కనీసం మూడు దశాబ్దాల పాటు పాలించే విధంగా వైసీపీని తీర్చిదిద్దగలనన్న నమ్మకం జగన్ కి ఉంది అనుకోవాలి. అలాగే, తన ప్రభుత్వం తన పాలన ఏంటో జనాలకు చూపించి మళ్ళీ మళ్లీ గెలిచి తీరుతాను అన్న అపారమైన నమ్మకం ఆయనకు ఉన్నాయని కూడా అర్ధం చేసుకోవాలి.

మరి జగన్ ప్రభుత్వంలో పనిచేసే మంత్రులు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ కీలక నాయకులు కానీ అనేది ఒక్కటే. జగన్ మరిన్ని టెర్ములు ఏపీని పాలిస్తారని, ఆయన ఏపీకి సీఎం గా ఉంటూనే ఏదో ఒక రోజున దేశానికి ప్రధాని కూడా అవుతారని చాలా మంది ఉత్సాహవంతులు జోస్యం కూడా ఇప్పటికీ చెబుతారు. అలా ఏపీలో తనకు తిరుగులేందని వైసీపీ అనుకుంటోంది.

ఇక 2024 ఎన్నికలను విపక్షాలు కలసి వచ్చినా విడిగా వచ్చినా కూడా గెలిచి తీరుతామని వైసీపీ నేతలు ఎపుడూ సవాల్ చేస్తూ ఉంటారు. మరి ఆ వైఎస్సార్ ఇంటి పుట్టిన ఆడపడుచు, వైఎస్ జగన్ తోడ బుట్టిన సోదరి, జగనన్న వదిలిన బాణంగా ఏపీ అంతా తిరిగి అన్న కోసం పనిచేసిన వైఎస్ షర్మిలకు మాత్రం జగన్ మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేదా అన్న డౌట్లు ఇపుడు కొత్తగా పుట్టుకుని వస్తున్నాయి.

ఎవరో విపక్షాలు జగన్ మళ్ళీ అధికారంలోకి రారు అంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ వైసీపీ అధికారంలోకి రావాలి. అన్నను ముఖ్యమంత్రి సీట్లో చూసుకోవాలని తెగ ఆరాటపడిన షర్మిల కూడా జగన్ ఓన్లీ సింగిల్ టైమ్ చీఫ్ మినిస్టర్ అని భావిస్తున్నారా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది. దానికి గల కారణాలు ఏంటి అంటే ఈ మధ్యనే ఎన్టీయార్ హెల్త్ వర్శిటీకి జగన్ పేరు మార్చేసి తన తండ్రి వైఎస్సార్ పేరు పెట్టారు.

ఆ నిర్ణయం తప్పు అని షర్మిల గట్టిగా విమర్శించారు. అంతవరకూ ఆమె అభిప్రాయాన్ని గౌరవించవచ్చు. అన్న గారు చేసే ప్రతీ పనీ చెల్లెమ్మకు నచ్చాలని ఉండదు. అయితే ఆమె దాంతోనే మరికొన్ని మాటలు అన్నారు. అవేంటి అంటే వైఎస్సార్ పేరు ఇపుడు పెట్టారు కానీ ఆ తరువాత వచ్చే ప్రభుత్వం ఆయన పేరు తీసేసి ఎంటీయార్ పేరు పెడితే అంతకంటే అవమానం వేరొకటి ఉంటుందా అని.

నిజంగా ఈ మాటలు టీడీపీ నేతలు అంటున్నారు. తాము అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంటనే ఎన్టీయార్ వర్శిటీకి తిరిగి పెద్దాయన పేరు పెడతామని ప్రతిన చేస్తున్నారు. తామే గెలుస్తామని టీడీపీ వారు చెప్పుకోవడం వరకూ ఓకే కానీ షర్మిల కూడా అదే సౌండ్ ఇచ్చేలా మాట్లాడడమే ఇక్కడ వింతా విచిత్రంలా ఉంది అని అంటున్నారు.

అంటే ఆమెకు కూడా జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రారు అన్న భావన ఉందా. లేక ఆ రకమైన అంచనాలు ఆమెకు ఉన్నాయా అన్న చర్చ అయితే గట్టిగా సాగుతోంది. ఇక వైసీపీ పెద్దలు డేరింగ్ గా ఎన్టీయార్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడం వెనక వారి ధీమా ఏంటి అంటే జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ మరి పవర్ లోకి రాదనే. కానీ సొంత చెల్లెమ్మకే డౌట్ వస్తున్న వేళ వైసీపీ వారు కూడా ఆలోచించుకోవాలేమో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.