Begin typing your search above and press return to search.

ష‌ర్మిల‌మ్మ తెలంగాణ‌లో గెల‌వ‌డం.. ఆలీబాబా అద్భుత ద్వీపం కాదు!

By:  Tupaki Desk   |   19 April 2021 2:31 AM GMT
ష‌ర్మిల‌మ్మ తెలంగాణ‌లో గెల‌వ‌డం.. ఆలీబాబా అద్భుత ద్వీపం కాదు!
X
తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ.. ఆవేశ పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో టీవీ చ‌ర్చ‌ల‌కు ఒక టాపిక్‌గా మారిన దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సోద‌రి.. ష‌ర్మిల తెలంగాణ గ‌డ్డ‌పై గెల‌వ‌డం అంత ఈజీ కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను పుట్టిల్లుగా, తెలంగాణ‌ను మెట్టిల్లుగా చెబుతూ.. సెంటిమెంటు రాజేస్తున్నా.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తూ.. హ‌డావుడి చేద్దామ‌ని చూస్తున్నా.. ప‌ట్టించుకునే నాధుడు క‌నిపించ‌డం లేదు. వాస్త‌వానికి ఇంకా పార్టీ పెట్ట‌లేదు. కానీ, మాట‌లు మాత్రం కోట‌లు దాటుతున్నాయి.

``రెండేళ్ల‌లో కాబోయే ముఖ్య‌మంత్రి నేనే, మ‌న పార్టీ అధికారంలోకి వ‌స్తుంది``- అని ష‌ర్మిల చేస్తున్న వ్యాఖ్య‌లు.. కేవ‌లం కొన్ని టీవీల‌కు న్యూస్‌గాను, మ‌రికొన్నింటికి చ‌ర్చ‌గాను ఉప‌యోగ‌ప‌డుతోందే త‌ప్ప‌.. వాస్త‌వానికి ష‌ర్మిల‌కు ఎక్క‌డా ఫాలోయింగ్ కానీ, ఎక్క‌డా కేడ‌ర్ కానీ లేక పోవడం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ష‌ర్మిల పార్టీ ఏంటో తెలియ‌దు, ఆమె జెండా.. అజెండా ఏంటో తెలియ‌దు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు మాత్రం ఆమెకు జై కొడ‌తారు. అంతేకాదు, ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం..`ఏదో కోపంలో పార్టీ పెడుతున్నట్టున్నారు`- అనే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం ఉన్న ట్రెండ్ ప్ర‌కారం.. టీవీ చానెల్స్‌కు టీఆర్ పీ రేటింగ్ కావాలి. సో.. అందుకే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుని.. ప‌రుష ప‌ద‌జాలంతో దూకుడుగా కామెంట్లు చేస్తే.. టీవీలో వ‌స్తారు, క‌నిపిస్తార ని.. త‌ప్పి తే.. అధికార‌ టీఆర్ ఎస్ నేత‌లు ఎక్క‌డా ష‌ర్మిల‌ను అస‌లు లెక్క‌లోకి కూడా తీసుకోవ‌డం లేదని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ క‌ష్టాల్లో ఉంది. సో.. ష‌ర్మిల పార్టీ పెడితే.. కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంద‌ని.. నేత‌లు మొత్తం ష‌ర్మిల వైపు మొగ్గుతార‌ని భావించిన లాజిక్ కూడా ప‌నిచేయ‌డం లేద‌ని అంటున్నారు.

ఏ పార్టీకైనా.. ముందు.. బూత్ లెవ‌ల్ కార్య‌క‌ర్త‌లు ఉండాలి. కేడ‌ర్ ఉండాలి. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ పార్టీల‌ను గ‌మ‌నిస్తే.. కాంగ్రెస్‌కు అతి పెద్ద కేడ‌ర్ ఉంది. భారీ ఎత్తున కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. అలాంటి పార్టీనే.. అధికార టీఆర్ ఎస్ ముందు చ‌తికిల ప‌డుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ వ్యూహాలు వేయ‌డంలో.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో..కేడ‌ర్‌ను ముందుండి న‌డిపించ‌డంలో కేసీఆర్‌, టీఆర్ ఎస్ వ్యూహాల ముందు.. కాంగ్రెస్ కురువృద్ధులు సైతం కుప్ప‌కూలుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అలాంటి ప‌రిస్థితిలో.. ష‌ర్మిల పార్టీకి ఏదో న‌లుగురు వ‌చ్చి ఏదో హ‌డావుడి చేస్తే.. ష‌ర్మిల సీఎం అవుతుందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీలో క‌నీసం మాజీ స‌ర్పంచ్ స్థాయి నేత‌లు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చేర‌లేదు. మ‌రి ఇలాంటి దుస్థితిలో ఉన్న ష‌ర్మిల పార్టీ మ‌నుగ‌డ సాధిస్తుందా? అంటున్నారు ప‌రిశీల‌కులు.