Begin typing your search above and press return to search.

ఏపీ రైతులకు 'వైఎస్‌ఆర్‌ జలకళ' పథకానికి శ్రీకారం !

By:  Tupaki Desk   |   28 Sep 2020 4:00 PM GMT
ఏపీ రైతులకు  వైఎస్‌ఆర్‌ జలకళ పథకానికి శ్రీకారం !
X
ప్రజాసంక్షేమమే మా లక్ష్యం అంటూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం .. ఆ దిశ గా శరవేగంగా అడుగులు వేస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటికే 90శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలకమైన హామీని నెరవేర్చింది. సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల ప్రచారం లో భాగంగా నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్ ‌వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం వైఎస్సా‌ఆర్‌ జలకళ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఈనెల 28న పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. 'వైఎస్‌ఆర్‌ జలకళ' కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయనుంది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందించనుంది. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్‌ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నిరవేర్చేదిశగా అడుగులు వేస్తున్నారు.

రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని గ్రామ వాలంటీర్ల ద్వారా.. లబ్ధిదారుడు పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆన్ ‌లైన్ ‌లోనూ అప్లై చేసుకునే వీలు ఉంది. రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ సదరు దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియోలజిస్ట్‌కు పంపుతారు. సాంకేతికంగా దానిని జియోలజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే డ్వామా అసిస్టెంట్ పిడి సదరు దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. బోరు డ్రిల్లింగ్‌ వేసేముందు రైతు పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోర్లు వేస్తారు. సదరు అనుమతి అనంతరం కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ సైట్‌ లో బోరుబావులను తవ్వుతారు. బోరుబావుల సక్సెస్‌ శాతంను బట్టి కాంట్రాక్టర్‌ కు బిల్లుల చెల్లింపులు జరుపుతారు. రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఒకవేళ లేకపోతే రైతులకు అంత భూమి లేకపోతే పక్కనే ఉన్నవారితో కలిసి బోరు వేయించుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. ఏ రోజు రైతు పొలంలో బోర్ డ్రిల్లింగ్ చేస్తారో అది కూడా అటు రైతు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా, ఇటు వాలంటీర్ల ద్వారా కూడా సమాచారం తెలుపుతారు.

ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, రైతులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో 2 లక్షల బోర్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ పథకం అమలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున బోరు వేసే యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే 30 ఏళ్లలో రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకే మీటర్లు బిస్తున్నట్లు ఆయన వివరించారు. రైతులందరికీ ఉచితంగా బోర్లు వేయిస్తాం. అయితే మేనిఫెస్టోలో లేకపోయినా సరే చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకు బోర్లతో పాటు మోటార్లు కూడా బిగిస్తాం. దీనికోసం అదనంగా రూ.1600 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి నియోజకవర్గంలో బోరు రిగ్గు ఏర్పాటు చేశాం’’ అని సీఎం జగన్‌ అన్నారు.