ప్రజలపై సీఎం జగన్ వరాల వాన..

Thu Oct 10 2019 15:28:32 GMT+0530 (IST)

YS Jagan Mohan Reddy Launches YSR Kanti Velugu Scheme

ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఏపీ సీఎం జగన్ వరాల వాన కురిపించారు. అందరికీ కనీస అవసరమైన వైద్య సేవల విషయంలో సంచలన నిర్ణయం తీసుకొని ఆదర్శంగా నిలిచారు. అనంతపురం జిల్లా పర్యటనలో ‘వైఎస్ఆర్ కంటివెలుగు ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కొత్త వరాలు ప్రకటించారు. 560 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టామని.. అక్టోబర్ 10 నుంచి 16వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తామన్నారు. అవసరమైతే ఆపరేషన్లు ఉచితంగా చేస్తామన్నారు.సీఎం జగన్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ కింద అందే చికిత్సలను రెండువేల వ్యాధులకు పెంచుతున్నట్టు సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు ఏపీతోపాటు చెన్నై - బెంగళూరు - హైదరాబాద్ లోని 150 ఆస్పత్రులలోనూ ఆరోగ్య శ్రీ సేవలు అందేలా ఒప్పందం చేసుకున్నామని.. ఏపీ ప్రజలంతా ఏపీతోపాటు పక్క రాష్ట్రాల్లోనూ ఉచితంగా వైద్యచికిత్సలు చేసుకోవచ్చని తీపికబురును అందించారు. 1000 రూపాయల వ్యయం దాటిన ప్రతి వ్యాధికి ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్సలు అందిస్తామన్నారు.

ఇక అన్నింటికంటే గొప్ప ప్రకటనను చేశారు సీఎం జగన్. పక్షవాతం - తలసేమియా వంటి ప్రాణాంతక వ్యాధులకు గురైన వారికి రూ.5వేల పింఛన్ ఇస్తామని ప్రకటించారు. డయాలసిస్ రోగులకు పదివేల చొప్పున ఇస్తామని వెల్లడించారు. 

డిసెంబర్ 21 నుంచి ఆరోగ్య శ్రీ సేవలను అందుబాటులోకి తెస్తామని.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభిస్తామని జగన్ తెలిపారు. విద్య - వైద్యం - వ్యవసాయానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని జగన్ హామీ ఇచ్చారు. జగన్ ఆరోగ్య వరాలు ప్రకటించడంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.