జూనియర్ లాయర్లపై జగన్ నిర్ణయమిదే..

Fri Oct 11 2019 10:14:44 GMT+0530 (IST)

YS Jagan Mohan Reddy Give Five Thousand Rupees Per Month to Junior Lawyers

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై వరాల వాన కురిపిస్తున్న జగన్ మరో ఎన్నికల హామీని నెరవేర్చాడు. నిన్ననే అనంతపురంలో ఏపీ ప్రజల ఆరోగ్యాలపై భరోసానిచ్చి కంటివెలుగు - ఆరోగ్యశ్రీ సేవలపై వరాలు కురిపించిన జగన్ తాజాగా జూనియర్ లాయర్లను కూడా వదలలేదు. ఎన్నికల్లో హామీనిచ్చిన మేరకు జూనియర్ లాయర్లకు నెలకు రూ.5వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామని ప్రకటించారు.వచ్చేనెల 2వ తేదీన పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన విధివిధానాలకు జగన్ ఆమోదం తెలిపారు. ఈనెల 14న జీవో జారీ చేస్తారు.

కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్ల వద్దకు కేసులు పెద్దగా రావు. వారు లా చదవి కూడా జూనియర్లుగా ఎవరో ఒకరి వద్ద ఫ్రీగా నేర్చుకునేందుకు బండ చాకిరీ చేస్తుంటారు. వారు వృత్తిలో స్థిరత్వం పొందే వరకు అంటే మూడేళ్లపాటు నెలకు రూ.5000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు జగన్ నిర్ణయించారు. అర్హులైన వారి వివరాలను సీఎఫ్ ఎంఎస్ పోర్టల్ లో ఉంచుతారు. సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామ - వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.

అర్హులైన జూనియర్ లాయర్లకు వచ్చే నెల 2వ తేదీన బ్యాంకు అకౌంట్లలో ఆ మేరకు నగదు జమ కానుంది. దీనికి సంబంధించిన రశీదులను లాయర్లకు వలంటీర్ల ద్వారా అందిస్తారు.  లాయర్లకు సంబంధించిన విధివిధానాలు మార్గదర్శకాలను  ప్రభుత్వం విడుదల చేసింది.