ఏపీ ముఖ్యమంత్రి జగన్.. తెలుగు రాష్ట్రాల్లో ది బెస్టు భర్త..ఎలానంటే?

Thu Sep 29 2022 12:32:23 GMT+0530 (India Standard Time)

YS Jagan Mohan Reddy Best Husband in Telugu States

యూత్ గా ఉన్నప్పుడు నచ్చిన అమ్మాయి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చిస్తాం. మనసు దోచిన అమ్మాయిని భార్యగా చేసుకున్న తర్వాత నుంచి ఆ అటెన్షన్ ను కాస్త తగ్గించటం చాలామంది అబ్బాయిల్లో కనిపిస్తుంది. ఇక.. కెరీర్ ను దైవంగా భావించే వారి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. భార్య.. పిల్లల కోసమే తాను 24 గంటలు పని చేస్తున్నట్లుగా చెప్పుకునే భర్తలు చాలామంది భార్యలకు ఇచ్చే ప్రాధాన్యత తగ్గించటమే కాదు.. తమ చేష్టలతో వారి మనసుల్ని గాయపరుస్తూ ఉంటారు. నిజానికి భార్య... భర్తల మధ్య లొల్లికి ప్రధాన కారణం.. భర్త తమకు కేటాయించాల్సిన సమయాన్ని కేటాయించకుండా ఉండటమేనని చెబుతారు.ఇలాంటి వాటికి భిన్నంగా తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిశాక.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మించిన అత్యుత్తమ భర్త మరెవరూ ఉండరని అనుకోకుండా ఉండలేరు. అంతేకాదు.. భర్త అన్నంతనే రోల్ మోడల్ గా జగన్ ను చూపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఆయన్ను విమర్శించే వారు సైతం.. తాజాగా ఆయన చేసిన పని గురించి తెలిసినప్పుడు మాత్రం.. భర్త అంటే ఇలా ఉండాలనుకోవటమే కాదు.. భార్యగా భారతి ఎంత లక్కీ అనుకోకుండా ఉండలేరు.

ఇంతకీ అదెలా అంటారా? అక్కడికే వస్తున్నాం. రెండు రోజుల క్రితం తిరుపతి పర్యటకు సీఎం జగన్ వెళ్లటం.. శ్రీవారికి పట్టువస్త్రాలు అందించటం తెలిసిందే. ఈ సందర్భంగా తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి బయలుదేరారు. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? గన్నవరం నుంచి నేరుగా తిరుపతికి వెళతారు. కానీ.. సీఎం జగన్ మాత్రం హైదరాబాద్ కు వచ్చి.. బేగంపేట ఎయిర్ పోర్టులో కాసేపు ఆగి.. కిందకు దిగకుండానే తిరుపతి వెళ్లిపోయారు. ఎందుకిలా? అంటే.. భార్య భారతిని తనతో పాటు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి తీసుకొని.. హైదరాబాద్ లో డ్రాప్ చేశారు.

అంటే.. భార్య కోసం సీఎంగా ఉన్న భర్త జగన్ హైదరాబాద్ కు వచ్చి ఆమెను దింపి మరీ తిరుపతికి వెళ్లారు. భార్య కోసం భర్త ఆ మాత్రం చేయరా? అనుకోవచ్చు. ఇక్కడితో ఇది అయిపోలేదు. తిరుపతి నుంచి తిరిగి గన్నవరం బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్.. నేరుగా గన్నవరం వెళ్లకుండా హైదరాబాద్ వచ్చారు. ఎందుకంటే.. భార్యను పికప్ చేసుకోవటం కోసం. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయన.. విమానం కిందకు దిగకుండా.. భార్య కోసంలోపలే ఉండిపోయారు.

ఇక్కడే మరో ట్విస్టు చెప్పాలి. బేగంపేటకు జగన్ ప్రయాణిస్తున్న ప్రత్యేక వాహనం చేరుకున్న పది నిమిషాలకో.. పావు గంటకో వైఎస్ భారతి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. భార్యను పికప్ చేసుకోవటానికి తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన జగన్.. ఆమె కోసం దాదాపు పావు గంట పాటు వెయిట్ చేసి మరీ తీసుకెళ్లారు.

ఇలా పికప్.. డ్రాప్ చేయటం కోసం ముఖ్యమంత్రిగా తన అమూల్యమైన సమయాన్ని భార్యకు కేటాయించటం మాటలా? అందుకే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్.. అత్యుత్తమ భర్తగా చెప్పక తప్పదు. ఈ విషయం తెలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని భార్యలకు జగన్ హీరోలా కనిపిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని భర్తలకు మాత్రం సరికొత్త విలన్ మాదిరి మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.