Begin typing your search above and press return to search.

ముందుంది పండుగ అంటున్న జగన్... ఎమ్మెల్యేలకు కఠిన పరీక్షలే...?

By:  Tupaki Desk   |   24 Nov 2022 9:35 AM GMT
ముందుంది పండుగ అంటున్న జగన్... ఎమ్మెల్యేలకు కఠిన పరీక్షలే...?
X
వైసీపీ అధినేత జగన్ ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా ఆలోచిస్తారు. అలా తాను నమ్మిన దాన్ని ఆయన ఎవరేమనుకున్నా అమలులో పెడతారు అని చెబుతారు.  ఈ విషయంలో మొహమాటాలూ రాజీలు అసలు ఉండవు. నిజానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరంటారు. కానీ జగన్ పొలిటికల్ డిక్షనరీలో శాశ్వత శత్రువులు ఉంటారు. ఇది సంప్రదాయ రాజకీయానికి భిన్నమే. అలాగే నాయకుడు అన్నాక సన్నిహితులు ఉంటారు. వారి కోసం కొన్ని సడలింపులు ఉంటాయి.

కానీ వైసీపీలో జగన్ కి  మాత్రం పార్టీయే ముఖ్యం. ఈ విషయంలో ఎంతటివారికి అయినా ఎలాంటి సడలింపులు లేవు అని జగన్ కచ్చితంగా చెబుతున్నారు. ఆయన ఇప్పటిదాకా మాటలతో చెప్పారు. ఇపుడు చేతలకు దిగిపోయారు. అది తాజాగా జిల్లా అధ్యక్షుల మార్పుతో పాటు రీజనల్ కో ఆర్డినేటర్ల మార్పుతో భారీ ఎత్తున చర్యలకు  జగన్ తెర తీశారని అంటున్నారు.

తాను చెప్పినట్లే చేస్తానని, పార్టీ కోసం ఎవరు పనిచేయకపోయినా కఠినమైన నిర్ణయాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జగన్ ఈ విధంగా స్పష్టం చేశారని అంటున్నారు. ఈ విషయంలో జగన్ తనకు అత్యంత సన్నిహితులు అని అందరూ భావించే సజ్జల రామక్రిష్ణారెడ్డి, మాజీ మంత్రులు  కొడాలి నాని బుగ్గన రాజేంద్రనాధ్, అనిల్ కుమార్ యాదవ్ లకు కూడా ఎలాంటి మినహాయింపులు  ఇవ్వలేదు అని అంటున్నారు. వారిని పార్టీ పదవుల నుంచి తీసేశారు. వారి ప్లేస్ లో కొత్తవారికి చాన్స్ ఇచ్చేశారు.

ఇది వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపు విషయంలో కచ్చితంగా అమలు చేసి జగన్ చూపిస్తారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి ఈ దిశగా ఇచ్చిన స్పష్టమైన సంకేతం అని కూడా అంటున్నారు. నిజానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కంటే ముందే పార్టీ పదవులను భర్తీ చేశారు. ఆనాడు మంత్రి పదవులు దక్కని వారిని తెచ్చి జిల్లా ప్రెసిడెంట్లను చేశారు. అందులో చాలా మంది ఒక మాదిరిగా పనిచేస్తున్నా కొందరు మాత్రం అసలు తమకు ఏమీ  మాత్రం పట్టదు అన్నట్లుగా వ్యవహరించారు.

అలాంటి వారికి జగన్ హెచ్చరికలు జారీ చేసి చూశారు. ఇక లాభం లేదని సుమారు ఏడున్నర నెలల తరువాత కఠిన నిర్ణయానికి దిగిపోయారు. ఇలా పార్టీ తనకు ఫస్ట్ తప్ప ఎవరూ కాదని జగన్ చెప్పదలచారు అని అంటున్నారు. ఇపుడు ఎమ్మెల్యే విషయనైకి వస్తే గడప గడపకు కార్యక్రమంలో కూడా గట్టిగా తిరిగే వారు ఒక కేటగిరీలో ఉంటే తిరగని వారు రెండవ కేటగిరిలో ఉన్నారు. పెద్దగా పట్టని వారు మూడవ కేటగిరీలో ఉన్నారు.

ఆ జాబితాలో 27 మంది ఎమ్మెల్యేలు ఉంటే కొందరు మంత్రులు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా గత వర్క్ షాప్ సందర్భంగా జగన్ గట్టిగానే క్లాస్ తీసుకున్నారని ప్రచారం సాగింది. ఇపుడు డిసెంబర్ నెల మొదటి వారంలో మరోసారి వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వరసబెట్టి జగన్ సర్వేలు చేయిస్తున్నారు. అవన్నీ అందుబాటులో ఉంచుకుని మరీ వారికి మరోసారి హెచ్చరికలు జారీ చేస్తారా ఇక వారి విషయంలో కూడా కొత్త ఇంచార్జిలను దించేసి టికెట్లు ఇవ్వమని చెబుతారా అన్నదే వైసీపీ ఎమ్మెల్యేలలో చర్చగా ఉంది.

మొత్తానికి చూస్తే జగన్ వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. తన లక్ష్యానికి నిర్ల్క్ష్యంగా ఎవరు ఉన్నారో వారిని హిట్ లిస్ట్ లో పెట్టి మరీ చర్యలకు దిగిపోతున్నారు. ఎవరు పనిచేయరో వారికి ఉద్వాసన పలకడానికి తాను రెడీ అని తాజాగా పార్టీలో చేసిన భారీ మార్పుల ద్వారా జగన్ చెప్పేస్తున్నారు.

ఒకవేళ ఎవరైనా తమ పనితీరు మార్చుకేలకపోయినా లేక మారాలని అనుకున్నా వారికి వ్యతిరేకత నిండా కనిపిస్తున్నా కచ్చితంగా టికెట్ కి టిక్కు పడిపోతుంది. ఎందుకంటే జగన్ ఆ సీటు అసలు వదులుకోరు కాబట్టి. సో ఇపుడు వైసీపీలో సీన్ చూస్తే ఎమ్మెల్యేల గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయి. మొత్తానికి జగన్ మార్క్ షాక్ ట్రీట్మెంట్ వైసీపీలో సరికొత్త చర్చకు తావిస్తోంది అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.