Begin typing your search above and press return to search.

ఇంకో నోటీసు ఇస్తే అప్పుడు ఆలోచిస్తా: వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   24 Jan 2023 1:17 PM GMT
ఇంకో నోటీసు ఇస్తే అప్పుడు ఆలోచిస్తా: వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు వేగం పుంజుకుంటోంది. ఇప్పటిదాకా నత్తనడకన ఈ హత్య కేసు విచారణ సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే వివేకా కుమార్తె సునీత కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడం, కోర్టు ఇందుకు అంగీకరించడం, విచారణను తెలంగాణలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయడం జరిగిపోయాయి.

దీంతో సీబీఐ వేగం పెంచింది. వైఎస్‌ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి కి నోటీసులు జారీ చేసింది. మంగళవారం జనవరి 24న హైదరాబాద్‌ లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇందుకోసం సీబీఐ అధికారులు పులివెందుల వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి లేకపోవడంతో ఆయన పీఏకి నోటీసులు జారీ చేశారు.

నోటీసులు జారీ చేయడంతో సీబీఐ అధికారులు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డిని కలవడానికి ప్రయత్నించారు. ఆయన ఇంటిలోనూ, పార్టీ కార్యాలయంలోనూ అందుబాటులో లేరు. ఆయన కోసం పార్టీ ఆఫీసులో సీబీఐ అధికారులు విచారించారు. అయితే భాస్కరరెడ్డి ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్లిపోయినట్టు వారికి తెలిసింది. దీంతో వైఎస్‌ భాస్కరరెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించిన సీబీఐ అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగారు.

మరోవైపు సీబీఐ నోటీసులపై వైఎస్‌ అవినాష్‌ రెడ్డి స్పందించారు. విచారణకు ఒక్కరోజు ముందు నోటీసులు ఇస్తే విచారణకు ఎలా రావాలని ప్రశ్నించారు. తనకు ముందుగా నిర్ణయించుకున్న నాలుగు ప్రోగ్రాములు ఉన్నాయన్నారు.

ఐదురోజుల తర్వాత విచారణకు హాజరవుతానని అవినాష్‌ రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు ఒక్క రోజు ముందు నోటీసులు ఇచ్చి రమ్మంటే ఎలా అంటూ అవినాష్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు ముందుగా కమిట్‌ అయిన నాలుగు ప్రోగ్రామ్స్‌ ఉన్నాయంటూ సీబీఐకి బదులిచ్చారు. ఐదు రోజుల తర్వాత ఎప్పుడైనా హాజరవుతారనంటూ సీబీఐ నోటీసులకు సమాధానం పంపారు. అలాగే సీబీఐకి ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తానన్నారు. సీబీఐ నుంచి మరో నోటీసు వస్తుందని, ఆ తర్వాత ఆలోచిస్తానంటూ వ్యాఖ్యానించారు. దీంతో సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశం అవినాష్‌ రెడ్డికి ఉందా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది.

రెండున్నరేళ్లుగా తనపై అసత్య ఆరోపణలు వస్తున్నాయని అవినాష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. తానేంటో ప్రజలకు తెలుసన్నారు. న్యాయం గెలవాలి.. నిజం వెల్లడి కావాలన్నదే తన కోరిక అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీలవుతారో ఆలోచించాలని అవినాష్‌ రెడ్డి కోరారు. మీ కుటుంబాల్లో ఇలాగే జరిగితే జీర్ణించుకోగలరా అని నిలదీశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.