Begin typing your search above and press return to search.

175 నంబర్ ...అత్యాశ కాదు...

By:  Tupaki Desk   |   29 Sep 2022 3:30 PM GMT
175 నంబర్ ...అత్యాశ కాదు...
X
ఏపీలో టోటల్ గా మేమే ఉండాలి. అన్ని సీట్లూ ఏపీలో గెలుచుకోవాలి అన్నది వైసీపీ అధినేత జగన్ నినాదం. ఆయన మొదటి సారి అన్నపుడు అంతా ఆశ్చర్యపోయారు. ఇది సాధ్యమేనా అనుకున్నారు. ఆ తరువాత పదే పదే అదే విషయం మీద తన పార్టీ వారికి దిశానిర్దేశం చేస్తున్నపుడు మాత్రం కచ్చితంగా గట్టి అజెండాతోనే అని అర్ధమవుతోంది. అయితే 175 మొత్తం ఒకే పార్టీ గెలిస్తే మరి విపక్షం లేని శాసన‌సభ వస్తే అది ఎలా ఉంటుంది అన్న దాని కంటే ఇది రాజకీయ అత్యాశగానే అంతా చూస్తున్నారు.

దీని మీద వైసీపీకి చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన వివరణ ఇచ్చారు. 175 సీట్లు మేమే గెలుచుకోవాలనుకోవడం అత్యాశ ఎలా అవుతుందని ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం గెలుపే కదా అని సహజ సూత్రాన్ని వల్లించారు. అలాంటపుడు ఏ ఒక్క సీటూ వదులుకోరాదని మా పార్టీ అధినేత డైరెక్షన్ ఇస్తే అందులో తప్పేముంది అంటున్నారు.

ఒక్క సీటు పోయినా ఫరవాలేదు అనుకుంటే పది సీట్లు పోతాయని ఆయన కొత్త విశ్లేషణను చెబుతున్నారు. అందువల్ల మాకు ప్రతీ సీటూ అతి ముఖ్యమని చెప్పడమే దీని వెనక ఉద్దేశ్యమని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో పనికి మాలిన ప్రతిపక్షం ఉందని ఆయన ఇదే సమయాన టీడీపీ మీద హాట్ హాట్ విమర్శలు చేశారు. అందువల్ల మొత్తం సీట్లను వైసీపీ గెలుచుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని బొత్స అంటున్నారు

రాజకీయాల్లో వారసుల మీద కూడా ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వైసీపీలో ఈసారి ఎన్నికలకు వారసులకు టికెట్లు ఉండవని పార్టీ అధినాయకత్వం స్పష్టం చేసినదని ప్రచారం ఒక వైపు సాగుతోంది. దాని మీద ఆయన మాట్లాడుతూ టికెట్లు ఇచ్చినా వారసులను గెలిపించాల్సింది ప్రజలు కదా అని పాత విషయాన్నే కొత్తగా చెప్పారు. ప్రజలు అనుకుంటేనే వారసుడు అయినా ఏ నాయకుడు అయినా గెలుస్తారు అన్నదే బొత్స మార్క్ రాజకీయ వ్యాఖ్యగా ఉంది.

అంటే జగన్ టికెట్లు వారసులకు ఇవ్వాలనా లేక ఇవ్వకూడదనా అన్న దాని మీద మాత్రం ఆయన ఏమీ చెప్పలేదు. అదేదో ప్రజలే చూసుకుంటారు అన్నట్లుగా మాట్లాడారు. అయితే వారసుడు గట్టిగా నిలబడి జనాల మెప్పు పొందితే ఆయనకే టికెట్ ఇస్తారు కదా. బహుశా ఈ లాజిక్ తోనే బొత్స మాట్లాడారు అని అంతా భావిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.