Begin typing your search above and press return to search.

ఎంత రాజకీయం అయితే మాత్రం.. ఇంతలా వెగటు పుట్టించాలా అనిల్ కుమార్?

By:  Tupaki Desk   |   28 Jan 2023 9:50 PM GMT
ఎంత రాజకీయం అయితే మాత్రం.. ఇంతలా వెగటు పుట్టించాలా అనిల్ కుమార్?
X
‘‘ఎం దరిద్రమో కానీ ఎం పాదాలురా నాయనా. అబ్బ పాదం పెడితే మనుషులు పోతుంటిరి. మనాయన పాదం పెడుతుంటే నందమూరి కుటుంబాన్ని ఆసుపత్రికి పంపిస్తుంటిరి. ఎందిరా ఈ పాదాలు? చెప్పు.. మనం పాదం పెట్టామో లేదో.. ఒకడికి స్టంట్ అంట ఆ కుటుంబంలో. తాత నుంచి పార్టీని లాక్కుంటిరి. నందమూరి కాస్తా నారా అయినాది. నారా అనేదానికి స్టాంప్ ఏస్తున్నారు. నందమూరి అనేదానికి పక్కన పెట్టేస్తున్నారు. నందమూరి తోకలా వెనక తిరుగుతుంటిరి’’

‘‘ఈ రోజు వాళ్లు వచ్చిన పాపానికి.. నా సామిరంగా పైకి పంపించే ప్రయత్నాలు చేస్తుంటిరి. ఏం పాదాలురా నాయనా. మీకు దండాలు రా నాయనా? అవి మామూలు లెగ్గులు కావట్టుంది సామీ. మంచి.. శుభసూచకం. ఎక్కడైనా ఎవరికైనా పదవి ఊడిపోయి ఉంటే.. అది చంద్రబాబునాయుడ్ని కలిసి ఉంటాడా వీడు అని చూస్తే. వారం రోజుల ముందు కలిసి ఉంటాడు’’

‘‘ఆహా.. ఏం మహిమరా అని.. ఇన్ స్టా.. ట్విటర్ లో చూస్తుంటాము కదా? ఎవడికైనా ఉద్యోగం ఊడిపోయినా.. ఎవడైనా ముఖ్యమంత్రి అయిపోకపోయినా.. ఎందిరా కర్మ అంటే.. చంద్రబాబు నాయుడ్ని కలిసి ఉంటాడన్న మాట. అట్లాంటి శుభసూచకమైన మీ నాయన్ను ముందు పెట్టుకొని.. ముందుగా బయటకు వచ్చినట్లున్నావ్. నిన్న ఫోటోలో చూసినా’’

ఈ వ్యాఖ్యల్ని విన్నంతనే ఏమనిపించింది? ఒక ప్రముఖుడి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి.. చావు బతుకుల మీద పోరాటం చేస్తూ.. ఆసుపత్రిలో ఉన్న వేళ.. ఆ కుటుంబం ఎంతటి వేదనలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వేళ.. వీలైనంత సానుభూతి.. కుదరదనుకుంటే నోరు మూసుకొని ఉండటం మంచిది. కానీ.. అందుకు భిన్నంగా ఏపీ రాష్ట్ర మాజీ మంత్రిగా వ్యవహరించిన అనిల్ కమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్ని విన్నంతనే వెగటు పుట్టటమే కాదు.. ఎంత రాజకీయం అయితే మాత్రం మరీ ఇంతలా దిగజారి మాట్లాడాలా? అన్న భావన కలుగక మానదు.

రాజకీయం అన్న తర్వాత తిట్లు.. వెక్కిరింపులు.. ఎటకారాలు మామూలే. విషయాల మీద మాట్లాడే రోజులు పోయి.. కేవలం రాజకీయం కోసం నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. వ్యక్తిగత విషయాల్ని తీసుకురావటం.. నోటికి వచ్చినట్లుగా తిట్టటం కూడా సర్లే అనుకొని సర్దుకుపోతున్న వేళ.. ఒకపక్క చావుబతుకుల మీద కొట్టుమిట్టాడుతున్న వేళ.. ఇలాంటి మాటలు మాట్లాడటం సరైనదేనా? అన్నది ప్రశ్న. ఎంత రాజకీయం అయితే మాత్రం.. ఎదుటోడు చనిపోతున్నా.. వాళ్ల గురించి.. వాళ్ల కుటుంబాల మానసిక పరిస్థితి గురించి ఆలోచించకుండా మాట్లాడే ఇలాంటి కల్చర్.. ఏపీ భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదు. రోజులన్ని ఒకేలా ఉండవన్న విషయాన్ని అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యతగా లేకున్నా ఫర్లేదు. బరితెగించినట్లుగా మాట్లాడటంతోనే ఇబ్బంది అంతా అన్నది మర్చిపోవద్దు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.