Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఆఫర్ చేసిన వైసీపీ...?

By:  Tupaki Desk   |   7 Feb 2023 9:31 AM GMT
టీడీపీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఆఫర్ చేసిన వైసీపీ...?
X
వచ్చే ఎన్నికల కోసం వైసీపీ అధినాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్ధులుగా నిలబెట్టాలనుకుంటోంది. అలాగే కొందరు ఎమ్మెల్యేలను తెచ్చి ఎంపీ సీటుకు పోటీకి దించాలని చూస్తోంది. దీని వల్ల అటూ ఇటూ మార్పులతో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. ఈ ప్రయోగంతో విశాఖ జిల్లాలో వారు వీరు కానున్నారు. విశాఖ ఎంపీగా ప్రస్తుతం ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు.

ఆయన్ని వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు వైసీపీ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. మరి విశాఖ ఎంపీ సీటుకు ఎవరు పోటీ పడతారు అంటే ఈసారి వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ తో ఈ సీటుని కొట్టాలని చూస్తోంది. విశాఖ ఎంపీ సీటుకు బీసీ అభ్యర్ధిని నిలబెట్టాలని చూస్తోంది. ఆ పార్టీలో మేయర్ హరి వెంకట కుమారి ఉన్నారు.

అయితే అవతల వైపు నుంచి చూస్తే టీడీపీ జనసేనల నుంచి బిగ్ షాట్స్ బరిలోకి దిగుతారు అని అందుతున్న సమాచారం. దాంతో వైసీపీ కూడా అనుభవం లెక్క వేసుకుని విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ ని ఎంపీగా పోటీ చేయించాలని చూస్తోందిట. ఈ వార్త ఇపుడు సంచలనంగా మారింది. ఈ మధ్యనే వాసుపల్లికి సౌత్ టికెట్ కన్ ఫర్మ్ చేశారని పార్టీ పెద్దల సమాచారంగా ఉంది.

అయితే ఇపుడు ఆయన్ని విశాఖ ఎంపీగా పోటీ చేయమని జగన్ నుంచే డైరెక్షన్ వచ్చిందని అంటున్నారు. ఇదే విషయాన్ని ఎంపీకి కూడా చెప్పి ఆయనను ఒప్పించారని అంటున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ సౌత్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం తరఫున గెలిచారు. ఆయన తెలుగుదేశం పార్టీ విశాఖ సిటీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. దాంతో ఆయనకు సిటీలో పట్టు ఉంది. అదే టైం లో ఆయన మత్య్సకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. బీసీ నేతగా గుర్తింపు ఉంది.

విశాఖ జిల్లాలో మత్యకార వర్గానికి ఎంపీ సీటు ఇవ్వడం అంటే అది వైసీపీ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ గా ఉంటుందని భావించే వాసుపల్లిని పోటీ చేయిస్తున్నారు అని అంటున్నారు. దాంతో పాటు ఆయనకు అంగబలం అర్ధం బలం కూడా ఉండడంతో ఆయన వైపు వైసీపీ హై కమాండ్ మొగ్గు చూపుతోందని అంటున్నారు. ఇక విశాఖ సౌత్ లో వైసీపీలో వర్గ పోరు ఉంది. వాసుపల్లికి టికెట్ ఇస్తే పార్టీ కి గుడ్ బై చెబుతామని కార్పోరేటర్లు కొందరు అధినాయకత్వానికి చెప్పాల్సింది చెప్పేశారు.

ఇక సౌత్ నుంచి 32వ వార్డు కార్పోరేటర్ కందుల నాగరాజు జనసేనలో చేరిపోయారు కూడా. మరింతమంది కార్పోరేటర్లు తమ వైపు వస్తారని ఆయన అంటున్నారు. దాంతో వైసీపీ హై కమాండ్ వాసుపల్లిని ఎంపీగా పంపించి అందరి ఆమోదంతో మరో అభ్యర్ధిని సౌత్ నుంచి పోటీకి పెట్టాలని చూస్తోంది అని అనంటున్నారు. ఇదిలా ఉంటే వాసుపల్లి వైసీపీ నుంచి బీసీ కార్డుతో పోటీ చేస్తే తెలుగుదేశం కూడా బీసీ కార్డుతో ఢీ కొంటుంది అని అంటున్నారు.

ఆ పార్టీ తరఫున టీడీపీ సిటీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావుని పోటీ చేయిస్తారు అని అంటున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా 2009లో ప్రజారాజ్యం తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. పార్లమెంట్ పరిధిలో యాదవుల జనాభా ఎక్కువ. దాంతో తెలుగుదేశం ఆ విధంగా కౌంటర్ అటాక్ చేస్తుంది అని అంటున్నారు. మొత్తానికి విశాఖ బీసీ నేతల సమరానికి రంగం సిద్ధం అవుతోంది అని అనుకోవాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.