మంత్రుల ఎదుట గోడువెళ్లబోసుకున్న వైసీపీ నేతలు!

Sat Oct 17 2020 14:40:53 GMT+0530 (IST)

YCP leaders marching in front of ministers

వైసీపీలో మరోసారి క్షేత్రస్థాయి నేతలు తమపై జరుగుతున్న వివక్షపై గళమెత్తారు. గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచి ఎమ్మెల్యేల విజయానికి కృషి చేశామని.. అధికార పార్టీలో ఇప్పుడు ఉన్నప్పటికీ తమను దూరంగా పెడుతున్నారని క్షేత్రస్థాయి వైసీపీ నేతలు వాపోయారు.ఈ మేరకు విజయవాడకు వచ్చిన పలువురు మాజీ ఎంపీపీలు వైసీపీ నేతలు రాష్ట్ర మంత్రులను కలిశారు. వీరంతా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పై మంత్రులకు తమ బాధ వెళ్లగక్కారు.

ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి మద్దిశెట్టి వేణుగోపాల్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రముఖ పారిశ్రామికవేత్త. ఈయన వైసీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆ నియోజకవర్గ నేతలంతా తాజాగా వైసీపీ అధిష్టానంను కలిసి ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే వేణుగోపాల్ తమకు సహకరించడం లేదంటూ వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలను కలిసి తమ ఇబ్బందులను విన్నవించామని తెలిపారు. అయినప్పటికీ ఎమ్మెల్యే తీరులో మార్పు రాకపోవడంతో మంత్రులను కలిసినట్లు వారంతా పేర్కొన్నారు.

కాగా వైసీపీ మంత్రులు బాలినేని కొడాలి నాని పేర్నినాని శంకర నారాయణ పెద్దిరెడ్డి సురేష్ ఎంపీ అవినాష్ రెడ్డిలు వీరి ఆవేదన అంతా విని సర్ధిచెప్పి ధైర్యం చెప్పారు.