Begin typing your search above and press return to search.

అక్కడ తెగ్గొడితే వైసీపీ ఖేల్ ఖతం... ?

By:  Tupaki Desk   |   22 Oct 2021 11:30 AM GMT
అక్కడ తెగ్గొడితే వైసీపీ ఖేల్ ఖతం... ?
X
వైసీపీ ఇపుడు ఏపీలో ఎదురులేకుండా ఉంది. అంతే కాదు, బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీని వీలున్నంతవరకూ అణగదొక్కుతోంది. ఏపీలో అన్ని ఎన్నికలను గెలిచి వీర విహారం చేస్తోంది. 2009 వరకూ చూస్తే ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో టీడీపీ బలంగా ఉంటూ వచ్చింది. దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన పాత్ర పోషించింది. ఇక రాష్ట్రం విడిపోయాక తెలంగాణాలో టీయారెస్, ఏపీలో వైసీపీ రూపేణ మరో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. వీటితో పోరాడలేక టీడీపీ గత ప్రాభవం మెల్లగా కోల్పోతోంది. ఈ నేపధ్యంలో 2019 ఎన్నికలో టీడీపీ రాజకీయ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఫలితాలను చవి చూసింది. అదే టైమ్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉండడం, ఢిల్లీలో తాము తెగనాడిన బీజేపీ అధికారంలోకి రావడంతో టీడీపీకి దిక్కు తోచడంలేదు.

మరో వైపు చూస్తే కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తూ గత రెండున్నరేళ్ళుగా జగన్ సజావుగా పాలన సాగిస్తున్నారు. జగన్ అవసరం కూడా బీజేపీకి ఉండడంతో ఆ బంధం అలా కొనసాగుతోంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ దక్షిణాదిన మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పావులను జాగ్రత్తగా కదుపుతోంది. ఏపీలో అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ కూడా బీజేపీకి దగ్గర కావాలనే తహతహలాడుతున్నాయి. ఇక చంద్రబాబు అయితే 2014 పొత్తులను 2024లో కొనసాగించాలని చూస్తున్నారు. అందుకోసం జనసేన రెడీగా ఉన్నా బీజేపీతోనే పేచీ అంతా అన్నట్లుగా సీన్ ఉంది.

ఇక బీజేపీని కూడా ప్రసన్నం చేసుకుంటే ఏపీలో జగన్ని గద్దె దింపడం ఈజీవే అన్న ఆలోచనల్లో బాబు ఉన్నారు. ఇపుడు ఏపీలో మండుతున్న రాజకీయం బీజేపీ దృష్టిని దాటిపోదు అనే అంటున్నారు. అదే విధంగా కమలం పార్టీ ప్రాపకం కోసం చంద్రబాబు వేస్తున్న ఎత్తులు కూడా కాషాయం పార్టీని ఎంతవరకూ కరిగిస్తాయి అన్నది కూడా చర్చగా ఉంది. 2024 ఎన్నికలలో తమకు పూర్తి మెజారిటీ రాకపోతే అపుడు ఏపీలోని రాజకీయ పార్టీల మీదనే మోడీ ఆధారపడాల్సి ఉంటుంది. ఆ టైమ్ లో జగన్, చంద్రబాబులో ఎవరు విశ్వాసపాత్రులుగా, నమ్మకంగా ఉంటారో అన్న విషయం మీదనే ఆధారపడి కేంద్రం చూపు ఏపీ పాలిటిక్స్ మీద ఉంటుంది అంటున్నారు.

చంద్రబాబు అయితే తాను పూర్తిగా మారిపోయాను అనే అంటున్నారు. కేంద్రం మద్దతుతో విర్రవీగుతున్న జగన్ని అక్కడ నుంచే బంధం తెగ్గొట్టి ఒంటరిని చేయాలన్న దూరాలోచన అయితే టీడీపీకి ఉంది. అందుకే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరుతున్నారు. అమిత్ షా తో అలా భేటీ వేసి దాన్ని గట్టి పరచుకోవాలనుకుంటున్నారు. మరి మోడీ కానీ షా కానీ చంద్రబాబు మీద సానుకూల దృక్పధంతో వ్యవహరిస్తారా, ఏపీ రాజకీయాల్లో కమలం తులసీ దళంగా ఎటు వైపు మొగ్గు చూపుతుంది అన్న దాని మీదనే ఫ్యూచర్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చెప్పాలి అంటే ఢిల్లీ పెద్దల మద్దతు సాధించిన వారే ఏపీలో బహు మొనగాడు అవుతాడు. జగన్ కి బీజేపీతో ఉన్న బంధాన్ని తెంచడానికి చంద్రబాబు వేస్తున్న మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం ఏపీలో వైసీపీ ఖేల్ ఖతం అని తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు.