Begin typing your search above and press return to search.

పార్టీ కోసం రూ.30 లక్షలు ఖర్చు చేశా.. ఇప్పుడు పట్టించుకోవటం లేదు

By:  Tupaki Desk   |   14 Jan 2022 2:04 PM GMT
పార్టీ కోసం రూ.30 లక్షలు ఖర్చు చేశా.. ఇప్పుడు పట్టించుకోవటం లేదు
X
ఏపీ అధికారపక్షం మేల్కోవాల్సిన టైం వచ్చేసింది. ఇంతకాలం తమ ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసి.. పార్టీ నేతల్ని.. పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన వారిని పట్టించుకోకపోవటం ఎక్కువైంది. అలాంటి వారి ఆవేదన పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంది. అందుకు నిదర్శనంగా గుంటూరుజిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తకు చెందిన ఒక సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. అమరావతి మండలం మల్లాదికి చెందిన దళిత నేత చిన్నా.. తమ పార్టీ నేతల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి రావటానికి తాను రూ.30 లక్షలు నష్టపోయానని.. తనలా ఎవరూ మోసపోవద్దన్నారు. పదేళ్లుగా పార్టీనినమ్ముకొని ఉన్న తన లాంటి వారిని కూడా పట్టించుకోవటం లేదన్నారు. అమరావతి ప్రాంతంలో మూడు రాజధానులకు అనుకూలంగా కార్యక్రమాల్ని నిర్వహించానని.. ఇప్పుడు తమ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారన్నారు. తన బాధను వీడియోద్వారా పంచుకున్న చిన్నా మాటలు ఇప్పుడు పార్టీలో చర్చగా మారాయి. ''మనకూ టైం వస్తుంది. అప్పుడు మనమేంటో చూపుదాం' అన్న అతడి మాటలు .. అధికార పార్టీనేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన టైం వచ్చిందన్న మాట వినిపిస్తోంది.

రాష్ట్రంలో తనలా పార్టీ కోసం కష్టపడిన వాళ్లు.. పార్టీ అధికారంలోకి రావటం కోసం ఆర్థికంగా నష్టపోయిన వారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నారన్నారు. కార్యకర్తలు లేనిదే పార్టీనే లేదని.. నేతలు తమ బంధువులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. కష్టపడి గెలిపిస్తే ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవటం లేదన్న చిన్నా.. తన లాంటోళ్లు రాష్ట్రవ్యాప్తంగాచాలామందే ఉన్నారన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

పార్టీకి మూలస్తంభాలైన కార్యకర్తల్లో ఆగ్రహం.. అసంత్రప్తి రాకూడదు. ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపరిగణలోకి తీసుకోవాలంటున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు వందల్లో సలహాదారుల్ని ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి.. వారిలో కొందరికైనా పార్టీ వ్యవహారాల్ని చూసే బాధ్యత అప్పగిస్తే.. ప్రభుత్వానికి కాసిన్ని తలనొప్పులు తగ్గే వీలుందేమో.. కాస్త ఆలోచించాలన్న సూచన వినిపిస్తోంది.