Begin typing your search above and press return to search.

వైసీపీ ప్లీనరీ : రక్తి కట్టనున్న రాజకీయ తీర్మానం...?

By:  Tupaki Desk   |   6 July 2022 9:41 AM GMT
వైసీపీ ప్లీనరీ : రక్తి కట్టనున్న రాజకీయ తీర్మానం...?
X
వైసీపీ అయిదేళ్ల తరువాత ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక వైసీపీ సర్కార్ ఏర్పడిన తరువాత తొలిసారి జరుగుతున్నా ఈ ప్లీనరీకి ఎంతో ప్రాధాన్యత ఉంది.

ప్లీనరీ ఈ నెల 8, 9 తేదీలలో రెండు రోజుల పాటు గుంటూరులో జరిగే వైసీపీ ప్లీనరీలో దాదాపుగా తొమ్మిది తీర్మానాలు ఆమోదించనున్నారు. అయితే ఇందులో రాజకీయ తీర్మానం మాత్రం అందరిలోనూ ఆసక్తి రేపనుంది.

వైసీపీ రాజకీయ పంధా ఏంటి, ప్రస్తుతం సాగుతున్న బాట ఎలా ఉంది. రేపటి ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అన్నది ఈ రాజకీయ తీర్మానంలో పొందుపరుస్తారు అని అంటున్నారు. ఇక ఏపీ రాజకీయ పరిణామాలను ఈ తీర్మానం పరిశీలిస్తుందని చర్చ ఉంది. అలాగే ఏపీలో పొత్తుల మీద కూడా ప్లీనరీ స్పష్టమైన తన విధానాన్ని ప్రకటిస్తుందని అంటున్నారు.

అలాగే ప్రత్యర్ధి పార్టీలు పొత్తులు పెట్టుకోవడం పైన కూడా ఈ ప్లీనరీలో ఏ రకమైన వ్యాఖ్యానాలు చేస్తారు అన్నది కూడా చూడాలి. జాతీయ స్థాయి రాజకీయాలు, వైసీపీ జాతీయ సంబంధాలు వంటివి రాజకీయ తీర్మానంలో ఉంటాయా అన్న ఉత్కంఠ ఉంది.

మొత్తానికి చూస్తే వైసీపీ పాలన మీద, సంక్షేమం మీద, మూడేళ్లలో ప్రభుత్వ సాధించిన విజయాల మీద ప్లీనరీలో చర్చ ఉంటుంది. ఇక అన్నింటికీ మించి రాజకీయ తీర్మానం గుంటూరు కారంగా ఉంటుందని అంటున్నారు.

రానున్న ఎన్నికలలో అటు క్యాడర్ కి దిశానిర్దేశం చేసేలా కూడా దీనిని తీర్చిదిద్దుతారని తెలుస్తోంది. ఇక అధ్యక్షుడిగా జగన్ తొలి ప్రసంగం ఉంటుంది. మలివిడత ప్రసంగంలోనే ఆయన ఏపీలో విపక్షాల మీద విమర్శలు ధాటిగా చేస్తారు అని అంటున్నారు.