Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌, సునీల్ కుమార్ పోటీ త‌త్వం ఉన్న‌క‌ళాకారులు: ఆర్ ఆర్ ఆర్‌!

By:  Tupaki Desk   |   14 May 2022 4:30 PM GMT
జ‌గ‌న్‌, సునీల్ కుమార్ పోటీ త‌త్వం ఉన్న‌క‌ళాకారులు: ఆర్ ఆర్ ఆర్‌!
X
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు తాజాగా శ‌ప‌థం ప‌ట్టారు. గత సంవత్సరం త‌న పుట్టిన రోజును ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్ మరచిపోకుండా చేశారని అన్నారు. ఆ రోజున తనకు జరిగిన అవమానాలు, అనుభవాలను గుర్తు పెట్టుకున్నాన‌ని.. అంత‌కు అంత బ‌దులు తీర్చేసుకుంటాన‌ని.. శ‌ప‌థం చేశారు. అంతేకాదు.. ఏదీ ఎక్కువ‌గా ఉంచుకోకూడ‌ద‌ని.. అలా ఉంచుకుంటే లావై పోతామ‌ని, ఇప్ప‌టికే తాను లావై పోయాన‌ని, అందుకే.. ఇప్ప‌డు రుణం తీర్చుకునేందుకు రెడీ అవుతున్న‌ట్టు వివ‌రించారు.

'నాపై సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్ గోల్ఫ్ పేరుతో రెక్కీ నిర్వహించి నన్ను అరెస్ట్ చేయించారు. సీఐడీ గుంటూరు ఆఫీసులో కెమెరాలు తీసివేసి, నా వ్యక్తిగత సెక్యూరిటీని బయటకు పంపి జగన్ మోహన్ రెడ్డి, పీవీ సునీల్‌ కుమార్ కుట్రపన్ని నాపై దాడి చేసారు. పోలీసులు నాపై చేసిన దాడిని లైవ్ ద్వారా ఉన్మాదికి చూపించారు. పుట్టినరోజు ఆఖరిరోజు అవుతుందనే భయం వేసింది.'' అన్నారు.

దాడి సంధర్భంగా త‌న‌పై దుర్భాషలు ఆడుతూ విచక్షణారహితంగా కొట్టారని చెప్పారు. ''ముఖ్యమంత్రి, సునీల్‌ కుమార్ ఇద్దరూ ఒకరిని మించిన కళాకారులు. కాళ్లు వాచిపోయేలా కొట్టారు. నన్ను కొట్టిన దెబ్బలకు మరుసటిరోజు వక్రభాష్యాలు చెప్పారు. గత సంవత్సరం నా పుట్టినరోజును మరపురాని పుట్టినరోజుగా చేసిన ఉన్మాదికి ధన్యవాదాలు" అని ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్యానించారు.

''గత సంవత్సరం పుట్టినరోజును మరపురాని రోజుగా చేసిన విషయాన్ని ఉంచుకోను, బదులు తీర్చేస్తాను. నావెంట ప్రజలు ఉన్నారు. సరియైన సమయంలో ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కి సమాధానం చెబుతాను. నాకు జరిగిన టార్చర్ భవిష్యత్‌లో ఎవరికి జరగకూడదు. రాష్ట్రంలో హింస పెరిగిపోతుంది. దీనికి కారణం ప్రజలు ఆలోచించాలి. నాపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌కు ఒక సంవత్సరం పూర్తయింది. లెక్కల ప్రకారం 60వ పుట్టినరోజు కానీ జగన్ పుణ్యం వల్ల ఇది మొదటి పుట్టిన రోజు'' అని అన్నారు.

చంద్రబాబు, పవన్ మధ్య పొత్తులు ఉంటాయ‌ని ర‌ఘురామ చెప్పారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ భయంతో వివిధ సభల్లో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గడపగడపకి వస్తున్న తీవ్ర ప్రతిస్పందన చూస్తే… ప్రజలు పార్టీ ప్రభుత్వాన్ని సాగనంపాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు ఎంత కవ్వించినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బెదరరని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మధ్య రానున్న ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని తెలిపారు. తన జీవితంలో జగన్ పుణ్యం వల్ల మొదటిసారి పోలీసుల చేతుల్లో ఎంపీగా ఉండి దెబ్బలు తిన్నానని అన్నారు. పార్టీ పెట్టే యోచన త‌న‌కు లేద‌ని ర‌ఘురామ వెల్ల‌డించారు. ''నాకు పార్టీ పెట్టే ఆలోచన లేదు. అలెయిన్స్‌లో ఉండే పార్టీలో మాత్రం ఉంటాను. అలెయిన్స్‌లో రెండు లేదా మూడు పార్టీలు ఉండవచ్చు. నాకు వైసీపీలో ఇక టికెట్ ఇవ్వరు, నేను ప్రస్తుత పార్టీలో కొనసాగే అవకాశం లేదు'' అని అన్నారు.