Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే కంట‌త‌డి.. రాజీనామాకు సిద్ధం!

By:  Tupaki Desk   |   21 Oct 2020 3:00 PM GMT
వైసీపీ ఎమ్మెల్యే కంట‌త‌డి.. రాజీనామాకు సిద్ధం!
X
అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే.. ఎలా ఉండాలి? ఓ ప‌ది మందికి స‌మాధానం చెప్ప‌గ‌లిగే రేంజ్‌లో ఉండా లి. త‌న ప‌నులు తాను చేసుకుంటూ.. మ‌రో ప‌ది మందికి చేయించే స్థాయిలో ఉండాలి. అధికారుల‌ను, ఇత‌ర నేత‌ల‌ను కూడా క‌ను సైగ‌ల‌తో శాసించేలా ఉండాలి- ఇది క‌దా అంద‌రూ కోరుకుంటారు. ఇలానే క‌దా అంద‌రూ అనుకుంటారు. కానీ, ఘ‌న‌త వ‌హించిన వైసీపీలో మాత్రం ఎమ్మెల్యేలు క‌న్నీళ్లు పెట్టుకుం టున్నారు. రాష్ట్రంలో ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌రకు కూడా నాయ‌కులు తీవ్ర మ‌న‌స్థాపంతో ఉన్నారు. కార‌ణాలు ఏవైనా.. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చినా.. త‌మ‌కే న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ల‌బోదిబో మంటున్నారు.

తాజాగా ప్ర‌కాశం జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఇలానే క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ``నా కాళ్ల కింద త‌డినే నేను తుడుచుకోలేక పోతున్నాను. ఇక‌, నేను ఎమ్మెల్యేగా ఉండడం ఎందుకు?`` అని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. విష‌యంలోకి వెళ్తే.. జిల్లాకు సంబంధించిన డీఆర్ సీ స‌మావేశం ఇటీవ‌ల జ‌రిగింది. ఈ స‌మావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు, ఇంచార్జ్ మంత్రి, జిల్లా అధికారులు.. ఎమ్మెల్యేలు కూడా పాల్గొని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష నిర్వ‌హిస్తారు. స‌మ‌స్య‌లు తెల‌సుకుంటారు. వాటికి ప‌రిష్కారాలు కూడా క‌నుగొనే ప్ర‌య‌త్నాలు చేస్తారు.

ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేల‌కు మాట్లాడే ఛాన్స్ ద‌క్కుతుంది. వారు త‌మ నియోజ‌క‌వ‌ర్గాలు, త‌మ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను, తాగునీరు, శానిటేష‌న్‌, ప్రాజెక్టులు, రోడ్ల స‌మ‌స్య‌లు వివ‌రించి ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. ఈ క్ర‌మంలో ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త‌న‌కే అన్యాయం జ‌రుగుతుంటే.. ఇక ప్ర‌జ‌ల గురించి ఏం చెబుతాను? ఏం పోరాడ‌తాను? అని తీవ్ర ఆవేశం వెళ్ల‌గ‌క్క‌డంతో ఒక్క‌సారిగా స‌మావేశ మందిరంలో పిడిగు ప‌డినంత ప‌నైంద‌ట‌! `` నా ప‌రిస్థితే దారుణంగా ఉంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే మాట అటుంచితే.. నా చెప్పులో రాయినే నేను తీసుకోలేక పోతున్నాను. ఎందుకు నాన్నా.. నీకు ఎమ్మెల్యే ప‌ద‌వి.. రాజీనామా చేసేయ్‌! అని చెబుతున్నాడు. నాకు కూడా ఈ ప‌రిస్థితి చూస్తే.. రాజీనామా క‌న్నా మ‌రో మార్గం క‌నిపించ‌డం లేదు`` అని ఏకంగా ఆయ‌న క‌న్నీటి ప‌ర్యంత మ‌య్యార‌ట‌.

దీంతో జిల్లాకు చెందిన మంత్రులు, ఇంచార్జ్ మంత్రి కూడా ఆయ‌న‌ను ఊర‌డించే ప్ర‌య‌త్నం చేస్తూ.. అస‌లు విష‌యం చెప్ప‌మ‌ని అడిగారు.. దీంతో ఆయ‌న త‌న బాధను వ్య‌క్తం చేసుకున్నారు. ``క‌రోనా నేప‌థ్యంలో పేషంట్ల‌కు ఇవ్వ‌మంటే.. మాకున్న కాలేజీని ప్ర‌భుత్వానికి ఇచ్చాం. మ‌న ప్ర‌భుత్వ‌మే క‌దా.. మ‌ళ్లీ మాకు య‌థాత‌థంగా అప్ప‌గిస్తార‌ని అనుకున్నాం. కానీ, క‌రోనా పేషంట్ల కార‌ణంగా కాలేజీ రూపు రేఖ‌లే మారిపోయాయి. భారీ ఎత్తున నాశ‌నం చేశారు. ఇప్పుడు కాలేజీని బాగు చేయించుకునేందుకు కోట్ల‌లో ఖ‌ర్చ‌వుతుంది. రేపో మాపో.. కాలేజీలు తీసేందుకు అనుమ‌తి ఇస్తున్నారు. ఇప్పుడు మా కాలేజీ ప‌రిస్థితి ఏంటి? మ‌న ప్ర‌భుత్వ‌మే క‌దా అని ఇస్తే.. వాడుకుని.. ఇప్పుడు కాలేజీ పాడైంది.. ప‌ట్టించుకుని బాగుచేయించండి అంటే.. వినేనాథుడు లేకుండా పోయాడు. మా బాధ‌నే మేం స‌రిచేసుకోలేక ‌పోతున్న‌ప్పుడు మాకు ఎమ్మెల్యే ప‌ద‌వి ఎందుకు? మా కుటుంబ స‌భ్యులు కూడా రాజీనామా చేయ‌మ‌ని ఒత్తిడి చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే కాలేజీనే వాడుకుని.. వ‌దిలేస్తే.. నేను ఎవ‌రికి ఏం చేయించ‌గ‌ల‌ను`` అని క‌న్నీటి ప‌ర్యంమ‌య్యారు. దీంతో ఇంచార్జ్ మంత్రి జోక్యం చేసుకుని .. స‌ద‌రు కాలేజీ సంద‌ర్శించాల‌ని అధికారుల‌ను ఆదేశించార‌ట‌. మ‌రి అధికారులు సంద‌ర్శించి.. ఏమేర‌కు న్యాయం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. ఈ ఘ‌ట‌న ఆ నోటా ఈనోటా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం.