Begin typing your search above and press return to search.

అవినీతేమీ కొత్త కాదు.. మేమేమీ సత్యవంతులం కాదు: వైసీపీ ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   30 Jan 2023 10:32 AM GMT
అవినీతేమీ కొత్త కాదు.. మేమేమీ సత్యవంతులం కాదు: వైసీపీ ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌!
X
అవినీతి కొత్తేమీ కాదని.. తామేమీ సత్యవంతులమని చెప్పడం లేదని నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో కంటే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఎక్కువ అవినీతి జరిగిందని వ్యాఖ్యానించారు. అప్పట్లో టీడీపీ నేత బీద రవిచంద్ర రూ.400 కోట్ల వరకూ దోపిడీకి పాల్పడ్డారని రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

మట్టి, గ్రావెల్‌ తవ్వకాలపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. తమ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలన్నీ పేదల ఇళ్ల అవసరాలకేనని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేయడం గమనార్హం. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో బీద రవిచంద్ర సహా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి మాలేపాటి సుబ్బానాయుడు గ్రావెల్‌ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.

అవినీతి అంతమొందిస్తామని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెబుతారని ఎమ్మెల్యే అన్నారు. అయితే దానిని ఎంతవరకు అమలు చేస్తున్నారన్నదే ముఖ్యమని తెలిపారు. అవసరాల కోసం కొందరు అనధికారికంగా గ్రావెల్‌ తవ్వుకుంటున్నారని వెల్లడించారు.

తాము రూ. 25 కోట్లు అవినీతికి పాల్పడ్డామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలోనూ భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు.

కావలిలో అక్కడక్కడా పురపాలక అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇకపై అలాంటి విమర్శలు రాకుండా చూస్తామన్నారు. ఎక్కడైనా ఇళ్ల నిర్మాణాల ప్లాన్లకు పురపాలక అధికారులు మామూళ్లు డిమాండు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.

కాగా అవినీతిని సమర్థిస్తూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఓవైపు సీఎం జగన్‌ అవినీతి రహిత పాలన అందిస్తున్నామని ఊరూవాడ చెబుతుంటే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి మాత్రం అవినీతి కొత్త కాదని.. గతంలో ఉందని సమర్థించుకోవడం బాలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.