Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ కాదిది.. బాబు జ‌న‌తా పార్టీ!

By:  Tupaki Desk   |   5 Aug 2022 11:32 AM GMT
ఏపీ బీజేపీ కాదిది.. బాబు జ‌న‌తా పార్టీ!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీని "బాబు జనతా పార్టీ"గా మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమ‌ర్శించారు. సీఎం జ‌గ‌న్ ను విమర్శిస్తే.. ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుని కవరేజ్ ఎక్కువ ఇస్తుందనే ఆత్రంతో బీజేపీ నేత సత్య కుమార్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. అమరావతిలో బీజేపీ నేతలు కొందరు పాదయాత్ర చేశార‌ని.. ఆ ముగింపు సభలో సత్యకుమార్‌​ అసత్య కుమార్ లా, సత్యదూరమైన మాటలు మాట్లాడార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తాను బీజేపీ కార్యదర్శి అని చెప్పుకుంటూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతు కోరలేదని వ్యాఖ్యలు చేసి, ఆ పార్టీ అధిష్టానంతో చీవాట్లు తిన్న విషయం అందరికీ తెలుసన్నారు.

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టి, కేసులకు భయపడి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరికో, సీఎం రమేష్‌కో... సత్యకుమార్‌ కొమ్ము కాస్తూ వస్తున్నాడ‌ని ఆరోపించారు. వీరంతా కలిసి, చివరికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని "బాబు జనతా పార్టీ" గా మార్చేశార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో త‌మ‌ ప్రభుత్వం చేసే మంచిని.. గడప గడపకు వెళ్ళి చెబుతుంటే చూసి ఓర్వలేక‌పోతున్నార‌ని మండిప‌డ్డారు.

కర్నూలులో హైకోర్టు పెట్టాలని బీజేపీ 2018లో డిక్లరేషన్‌ చేసింద‌ని గుర్తు చేశారు. అలాంటిది వైఎస్సార్సీపీ ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామంటే.. ఆ పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ డిక్లరేషన్ కు అనుకూలంగా ఎందుకు నిర్ణయం తీసుకోలేక‌పోతోంద‌ని నిల‌దీశారు. అలాగే అమరావతి అనేది స్కామ్‌ క్యాపిటల్ అని బీజేపీ నేత‌లే అన్నార‌ని గుర్తు చేశారు. టీడీపీ ప్ర‌భుత్వ హయాంలో అమరావతి రాజధాని పేరుతో లక్ష కోట్లు మింగేస్తున్నారంటూ బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు కూడా చేశార‌ని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు.

వికేంద్రీక‌ర‌ణ‌కు వ్యతిరేకమా.. అనుకూలమా.. అనేది బీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేయాల‌న్నారు. రాష్ట్రం బాగుండాలని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చాలని వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం విధాన నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. పరిపాలనా వికేంద్రీకరణ నిర్ణయాన్ని బీజేపీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాల‌ని అని నిల‌దీశారు.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింద‌ని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. మరి దానిపై అసత్య కుమార్‌ ఎందుకు నోరు తెరవడం లేద‌ని ప్ర‌శ్నించారు. రాయ‌ల‌సీమలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనేని చెప్పారు. బీజేపీ సహకారంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉ‍న్న సమయంలోనూ రాయలసీమకు ఏం చేశారంటే నోరు మెదపలేని పరిస్థితి బీజేపీది ఎద్దేవా చేశారు.

ఏపీ నుంచే దేశం అంతా గంజాయి సరఫరా అవుతుందంటూ మాట్లాడటానికి అసత్య కుమార్‌కు సిగ్గుండాల‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులే అధికారంలో ఉన్నార‌ని ఎద్దేవా చేవారు. మరి దేశంలో గంజాయిని అడ్డుకోకుండా గాడిదలను కాస్తున్నారా? అని నిల‌దీశారు. అమరావతిలో అసత్యకుమార్‌కు, ఆయన అనుచరులకు కూడా భూములు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయ‌న్నారు. వ్యక్తిగత అజెండాతో ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే సహించేది లేద‌ని హెచ్చ‌రించారు. శ్రీకాంత్ రెడ్డి ఘాటు విమ‌ర్శ‌ల‌పై వైఎస్సార్సీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.