మేం ఇచ్చిన సొమ్ము తీసుకుని మాపైనే విమర్శలా.. మహిళపై వైసీపీ ఎమ్మెల్యే చిందులు

Tue Dec 06 2022 12:00:09 GMT+0530 (India Standard Time)

YCP MLA Nallapa Reddy Prasanna Kumar Reddy Warning To Woman

ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు పేట్రేగుతున్నాయని విపక్షాలు ప్రచారం చేస్తుంటే.. అబ్బే అదేం లేదు.. అంతా విష ప్రచారమేనని వైసీపీ అధినేత సీఎంజగన్ స్వయంగా పలు సభల్లో నొక్కి వక్కాణిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్తితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. తమను ప్రశ్నించిన వారిని ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టిన వారిని పనిగట్టుకుని హెచ్చరిస్తున్నారు. బెదిరింపులతో బెంబేలు పెట్టిస్తున్నారు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొవ్వూరులో జరగిన ఘటన దీనిని అద్దం పడుతోంది.కొవ్వూరు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ ఇంటికి వెళ్లగా ఆ ఇంటి మహిళ రాజ్యలక్ష్మి ప్రభుత్వ తీరును ప్రశ్నించింది. చెత్తపన్ను విధింపు ధరల బాదుడుపై విమర్శలు గుప్పించింది. దీంతో ఎమ్మెల్యే చిందులు తొక్కారు.

అంతేకాదు ఇంతకు ముందు రెండు రోజుల కిందట ఇక్కడ నిర్వహించిన టీడీపీ `ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి` కార్యక్రమంలో ఈమె పాల్గొన్నదన్న సమాచారం కూడా ఎమ్మెల్యేకు చేరడంతో మరింత రెచ్చిపోయారు.

``ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నావా?  లేదా?  సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? ఇవన్నీ తీసుకుంటూనే ప్రభుత్వం పై విమర్శలు చేస్తావా?  బుద్ది ఉండొద్దా.. మనిషివేనా? తలుచుకుంటే పథకాలు ఆపేయిస్తాం`` అంటూ రాజ్యలక్ష్మిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు.. ప్రభుత్వంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే అంతు చూస్తామని హెచ్చరించారు. ఇక అక్కడికక్కడే ఆమె భర్త ఏం చేస్తుంటాడని ప్రశ్నించగా.. వైసీపీ కార్యకర్తలు కొందరు.. ఆయన మునిసిపాలిటీ పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్నట్టు చెప్పారు.

దీంతో వెంటనే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపేయండి.. అప్పుడు తెలుస్తుంది! అంటూ.. నిప్పులు చెరిగారు. కాగా ఎమ్మెల్యే తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం ఇస్తున్నామంటే ఊరికేనే ఇస్తున్నారా?  అని ప్రశ్నించారు. అయితే అప్పటికే ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి ఈ ఘటన వైసీపీ నేతల తీరును మరోసారి కళ్లకు కట్టిందని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు.