జగన్ గ్రేట్ : మా గ్రాఫ్ డౌన్... వైసీపీ ఎమ్మెల్యే హాట్ హాట్..

Wed Jun 29 2022 20:33:53 GMT+0530 (IST)

YCP MLA Comments on CM Jagan

జగన్ ది గ్రేట్. ఇది మేము ఒప్పుకుంటాం ఎందుకంటే ఆయన తాడేపల్లి నుంచి బటన్ నొక్కేసి నేరుగా లబ్దిదారులకు  నగదు బదిలీ చేస్తున్నారు. అందువల్ల ఆయనకు మంచి పేరు వస్తోంది. ఎమ్మెల్యేలుగా మా ఫేట్ చూస్తేనే బొత్తిగా బాలేదు... ఈ మాటలు అన్నది విపక్ష ఎమ్మెల్యే కాదు సొంత పార్టీ నాయకుడే. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సొంత పార్టీ మీదనే తెగ చికాకు పడ్డారు. తన మనసులో ఏమీ దాచుకోకుండా చెప్పాల్సింది చెప్పేశారు. దాంతో ప్రకాశం జిల్లాలో జరిగిన ప్లీనరీలో ఆయన కామెంట్స్ సంచలనం రేపాయి.వేదిక మీద కూర్చున్న నాయకులు అయితే ముఖాలు చూసుకోవాల్సి వచ్చింది. మీరు జగన్ సార్ తో కలివిడిగా ఉంటారు కదా. మా గోడు అక్కడ ఆయనకు వినిపించండి  అంటూ మద్దిశెట్టి వేణుగోపాల్ బాహాటంగానే మైకు పుచ్చుకుని మొర  పెట్టుకున్న తీరు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జగన్ అంటే మంచి పేరు ఉంది. ఆయన జనాలకు డబ్బులు బాగా ఇస్తున్నారు. మరి ఎమ్మెల్యేలుగా మా సంగతేంటి అని మద్దిశెట్టి అడిగిన సూటి ప్రశ్న ఆయన ఒక్కరిదే కాదేమో.

ఎందుకంటే ఇదే ఆవేదన చాలా మంది ఎమ్మెల్యేలలో ఉంది. ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోంది అని హై కమాండ్ అంటోంది. ఎందుకు గ్రాఫ్ పడిపోతోంది అన్నది మాత్రం అసలు ఆలోచించడంలేదు. ఎందుకు తమ గ్రాఫ్ డౌన్ అవుతోంది అన్నది మద్దిశెట్టి బహు చక్కగా ప్లీనరీలో వివరించారు. ఆయన ఏమన్నారూ అంటే గడప గడపకూ వెళ్తూంటే ప్రజలు రోడ్ల సంగతేంటి అని అడుగుతున్నారు డ్రైనేజీల గురించి నిలదీస్తున్నారు. మంచి నీరు సహా స్థానిక సమస్యలు మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతున్నారు అని మద్దిశెట్టి గోడు వెళ్ళబోసుకున్నారు.

ఏం చేయాలన్న మా దగ్గర నిధులు లేవు దాంతో మేము అలా ఉండిపోతున్నామని ఆయన వాపోయారు. అందువల్ల ఎమ్మెల్యేలకు నిధులు ప్రత్యేకంగా ఇవ్వమని సీఎం సార్ కి చెప్పండి అని వైసీపీ పెద్దలను ఆయన కోరారు. మరో వైపు చూస్తే తన నియోజకవర్గం దర్శిలో పార్టీ కార్యకర్తలకు కాంట్రాక్టు పనులు పెద్ద ఎత్తున తీసుకొచ్చామని మూడేళ్ళు అయినా వారు చేసిన పనులకు బిల్లులు రాలేదని ఆయన పేర్కొన్నారు. అలా నియోజకవర్గానికి వంద కోట్ల దాకా సొమ్ము సర్కార్ వారి బాకీగా ఉండిపోయింది అని మద్దిశెట్టి అంటున్నారు.

ఇంకో మాట ఏంటి అంటే ఆయన తాజాగా ఒక కార్యకర్త ఇంటికి వెళ్లారుట. ఆరు నెలలుగా ఆయన కనిపించలేదేమని ప్రశ్నిస్తే ఆయన భార్య బయటకు వచ్చి పాతిక లక్షల కాంట్రాక్ట్ పనులు చేసి అప్పుల పాలు అయ్యామని వడ్డీలు చెల్లించలేక ఇల్లు అమ్మేసుకున్నామని చెప్పి ఆవేదన చెందిందని మద్దిశెట్టి అంటున్నారు. గడప గడపకు చూస్తే ఇవే బాధలు అని ఆయన వివరించారు.

వైసీపీ ఏలుబడిలో ఇవి కార్యకర్తల బాధలు జనాల బాధలు ఎమ్మెల్యేల బాధలు కూడా అంటూ ఆయన వివరించిన తీరు చూస్తే వైసీపీ లో గుట్టు ఏంటి అన్నది అందరికీ అర్ధమైపోతోంది. మరి ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇక ఎమ్మెల్యేలు ఇంకా పెద్ద నోరు చేస్తారు. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడినా ఆ మీదట కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గోల పెట్టినా ఇపుడు మద్దిశెట్టి మనో వేదన చూసినా ఏముంది గర్వకారణం అంతా దారుణం అన్నట్లుగానే వైసీపీ ఏలుబడి కనిపిస్తోంది అంటున్నారు.