Begin typing your search above and press return to search.

బాబే కావాలంటున్న వైసీపీ...?

By:  Tupaki Desk   |   28 Jan 2023 9:16 AM GMT
బాబే కావాలంటున్న వైసీపీ...?
X
అదేంటో తెల్లారి లేస్తే చంద్రబాబుతోనే వైరం. కానీ బాబే మాకు కావాలని వైసీపీ అంటోంది. వినడానికి చిత్రంగా ఉన్నా వైసీపీ నేతలు మంత్రులు మాత్రం బాబుతోనే తాము సమరమైనా మరేదైనా చేస్తామని అంటున్నారు. దానికి కారణం చంద్రబాబు రాజకీయ దిగ్గజం. బాబు మీద ఎంత విమర్శలు చేసినా వైసీపీకి అది ఇబ్బంది కాదు. పైగా చంద్రబాబుతో యుద్ధం అంటే హోదాగానే ఉంటుంది.

ఎవరు అవునన్నా కాదన్నా బాబు గారిది నాలుగున్నర దశాబ్దాల జీవితం. ఆయన అపర చాణక్యాన్ని ఎవరూ వంక పెట్టలేరు. ఆయన జాతీయ స్థాయి నాయకుడు. ఈ రోజుకీ దేశంలో చాలా మంది కంటే డైనమిక్ లీడర్. ప్రధాని అభ్యర్ధికి సరితూగే అనుభవం ఉన్న వారు. సో బాబుతో పేచీ అయినా పందెం అయినా ఎవరైనా కోరుకుంటారు. ఏపీలో వైసీపీ కూడా అదే ఇపుడు కోరుకుంటోంది.

వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే లోకేష్ తో మాకు పోటీయా అంటూ నీరసపడిపోతున్నారు. లోకేష్ ని ముందు పెట్టి విమర్శించమంటే ఏమి చేస్తామని నిరుత్సాహంగా మాట్లాడుతున్నారు. యుగళం పేరిట లోకేష్ ని జనంలోకి పంపారు కానీ ఆయనది వికసించే గళం కాదని, ఆయన ఏమి మాట్లాడుతారు బాబు గారూ అంటున్నారు వైసీపీ మంత్రి గారు.

మీరే ఆ యాత్ర ఏదో చేస్తే మేము ధీటుగా విమర్శించుకుంటాం కదా మంత్రి గారు సలహా ఇస్తున్నారు. ఒక వైపు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన్ని విమర్శించక తప్పని అవస్థలో మేమున్నామని తెగ మధనపడిపోతున్నారు. నిజంగా వైసీపీకి ఇపుడు కష్టం తెలుస్తోంది.

చంద్రబాబు అంటే మాట అన్నా మాట తిన్నా బాగానే ఉండేది. కానీ ఇపుడు తమ రాజకీయాన్ని ఎత్తిపెట్టి నానా మాటలు లోకేష్ అంటూంటే మంటగా ఉంది. అలాగని లోకేష్ ని లైట్ తీసుకుని ఊరుకోలేరు. ఆయన మానాన పాదయాత్రని వదిలేయలేరు. దాంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా లోకేష్ పాదత్ర స్పీచ్ అయిందో లేదో మాజీ మంత్రి పేర్ని నాని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. లోకేష్ ని విమర్శించడమేంటి ఆయనకు ఏమి తెలుసు అంటూ పేర్ని నాని తన మీడియా మీటింగ్ పూర్తి చేశారు.

మరో వైపు చూస్తే వైసీపీలో సీనియర్ నేతలు ఎవరూ లోకేష్ మీద విమర్శలు చేయడానికి ఇష్టపడడం లేదు అని అంటున్నారు. సీనియర్ మంత్రులు కూడా తమ స్థాయి అనుభవం గుర్తు చేసుకుంటున్నారు. దాంతో వైసీపీకి మా చెడ్డ చిక్కు వచ్చి పడింది. లోకేష్ పాదయాత్ర చేయడమేంటి ఆయన స్థాయి ఏంటి అని నిన్నటిదాకా మంత్రులు అదే పనిగా ప్రశ్నించారు. దానికి లోకేష్ రెండేళ్ళ పాటు తాను మంత్రిగా చేశాను ప్రజల సమస్యలు తీర్చాను బాధ్యత గల ఎమ్మెల్సీగా ఉన్నాను అంటూ ఏకరువు పెట్టారు. ప్రజల కోసం పాదయాత్ర చేయడానికి అర్హతలు కావాలా అని ఆయన నిలదీశారు.

మొత్తానికి లోకేష్ పాదయాత్ర వెనకాల బాబు డైరెక్షన్ ఇపుడు టీడీపీకి ఇరకాటంగా ఉంది. లోకేష్ ని ఏమీ అనకపోతే అలా వదిలిపెడితే హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ పోతారు. అలాగని ఆయన్ని రోజూ టార్గెట్ చేస్తే తామే పెద్ద లీడర్ ని చేయాలా అన్న బాధ ఉంది. యువగళం చూస్తే వైసీపీకి రాజకీయ అయోమయంగా మారింది అని అంటున్నారు. ఇది కూడా బాబు చాణక్య వ్యూహంలో భాగమని ఆలస్యంగా తెలుస్తోంది మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.