Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారుకు అవకాశాలిస్తున్న నిమ్మగడ్డ

By:  Tupaki Desk   |   24 Oct 2020 11:30 AM GMT
ఏపీ సర్కారుకు అవకాశాలిస్తున్న నిమ్మగడ్డ
X
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి చూస్తుంటే సుప్రింకోర్టు ఆదేశాలను కూడా ఉల్లఘింస్తున్నట్లే ఉంది. ఈనెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో ఎన్నికల నిర్వహణపై సమావేశం పెట్టారు. వాయిదా వేసిన ఎన్నికలను నిర్వహించే విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా నిర్ణయం తీసుకోవద్దని సుప్రింకోర్టుకు గట్టిగా చెప్పింది. కానీ ఆదేశాలను నిమ్మగడ్డ ఫాలో అవుతున్నట్లు లేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో ఆమధ్య ఎంత గొడవ జరిగిందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ ను కారణంగా చూపించి నిమ్మగడ్డ మొన్నటి మార్చిలో ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేయటంతో ప్రభుత్వంతో గొడవ మొదలైంది.

నిజానికి కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని అనుకున్నపుడు ముందుగా ప్రభుత్వంతో ఓమాట చెప్పుంటే బాగుండేది. ప్రభుత్వం ఎటువంటి అభిప్రాయం చెప్పినా నిమ్మగడ్డ తన నిర్ణయం తాను తీసుకునుంటే బాగుండేది. ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నా అప్పుడు నిమ్మగడ్డపై తప్పుండేది కాదు. అందుకే ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో మాట్లాడకుండా నిర్ణయం వద్దని నిమ్మగడ్డను సుప్రింకోర్టు ఆదేశించింది.

అయితే జరుగుతున్న తంతు చూసిన తర్వాత అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవేమిటంటే అసలు ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించారా అన్నది. నిజంగానే ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ సంప్రదించుంటే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పేసుండేది. అప్పుడు రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించే అవసరం ఉండేదే కాదు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాబట్టి నిమ్మగడ్డకు కూడా ఇదే విషయం చెప్పేదే.

అలా కాకుండా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నారంటేనే ప్రభుత్వంతో నిమ్మగడ్డ మాట్లాడలేదని అర్ధమైపోతోంది. ఒకే ఒక్క కరోనా వైరస్ ఉన్నపుడేమో ప్రజల ప్రాణాలను రక్షించటానికే ఎన్నికలను వాయిదా వేశానని అప్పట్లో నిమ్మగడ్డ చెప్పుకున్నారు. మరి ఇపుడు రోజుకు సగటున 4 వేల కేసులు రిజస్టర్ అవుతున్న విషయం తెలిసీ ఎన్నికలను నిర్వహించాలని ఎలాగనుకున్నారు ? అంటే వచ్చే మార్చిలో తన పదవీకాలం పూర్తయ్యేలోగానే ఎన్నికలను నిర్వహించేయాలని నిమ్మగడ్డ డిసైడ్ చేసుకున్నారా ? ప్రభుత్వం ఆమోదం లేకుండానే నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించగలరా ? చూద్దాం 28 సమావేశంలో ఏమి నిర్ణయిస్తారో ?