Begin typing your search above and press return to search.

మార్కెట్లోకి ఫ్లయింగ్ కార్లు.. ధర ఎంత? డెలివరీ ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   29 Oct 2020 4:30 AM GMT
మార్కెట్లోకి ఫ్లయింగ్ కార్లు.. ధర ఎంత? డెలివరీ ఎప్పుడంటే?
X
ఇంట్లో నుంచి బయటకు తీసినప్పుడు కారులా.. కాస్త దూరం వెళ్లగానే ట్రాపిక్ చిక్కుల్లో చిక్కుకోకుండా ఎంచక్కా ఎగురుతూ గమ్యస్థానానికి వెళ్లిపోతే ఎంత బాగుండు? ఈ కల ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా ఉన్నదే. ఈ కలను సాకారం చేయటానికి వాహన కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు.. ప్రయోగాలు అన్ని ఇన్ని కావు. ఎట్టకేలకు.. ఈ ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ప్లయింగ్ కార్ల తయారీ పూర్తి కావటమే కాదు.. వీటిని మార్కెట్లోకి అమ్మేందుకు యూరోపియన్ యూనియన్ అనుమతిని ఇచ్చేసింది. దీంతో.. త్వరలోనే ఈ ఫ్లయింగ్ కార్లు రోడ్ల మీదకు వచ్చేసే రోజులు దగ్గరకు వచ్చేసినట్లే చెప్పాలి.

మూడు చక్రాలతో.. చిన్నసైజు హెలికాఫ్టర్ మాదిరి కనిపించే ఈ ఎగిరే కాదు.. గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించారు. ఈ ఎగిరే కార్లను అమ్మటానికి వీలుగా డచ్ సంస్థ పాల్ వీ లైసెన్సు పొందింది. ఈ ఎగిరే కారుకు లిబర్టీ అనే పేరు పెట్టారు. స్విచ్ విధానంతో రోడ్డు మీద ప్రయాణం ప్రారంభించిన పది నిమిసాలకే గాల్లోకి ఎగిరేలా దీన్ని రూపొందించారు. రోడ్డు మీద గంటకు 160 కి.మీ. వేగంతో.. గాల్లో అయితే గంటకు 180కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. దీని ట్యాంకులో ఇంధనం ఫుల్ ట్యాంక్ చేయిస్తే.. ఏకబిగిన 500కి.మీ. దూరం వరకు ప్రయాణించే సత్తా వీటి సొంతమని చెబుతున్నారు వీటి తయారీదారులు.

ఈ ఎగిరే కారును తయారు చేసి చాలాకాలమే అయినా.. వీటిని మార్కెట్లోకి తెచ్చేందుకు అధికారిక అనుమతుల కోసం సుదీర్ఘ కాలం ఎదురుచూసినట్లుగా పాల్ వి సంస్థ వ్యవస్థాపకులు రాబర్ట్ డింగె మాన్సే వెల్లడించారు. తొలిదశలో తాము తయారు చేసిన 90 కార్లను అమ్మకానికి పెడతామని.. ఆ తర్వాత మరోసారి ఉత్పత్తి షురూ చేస్తామని చెబుతున్నారు. తొలిదశలో తయారు చేసిన ఈ కార్ల ధరను 5లక్షల యూరోలు (రూ.4.37కోట్లు) గా నిర్ణయించారు. రెండో దఫా తయారు చేసే కార్లను మాత్రం నాలుగు లక్షల యూరోల(రూ.3.5కోట్లు)కు అమ్మనున్నట్లు వెల్లడించారు. ఈ కార్ల అమ్మకాలకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయని.. నెదర్లాండ్స్ లో ఇప్పటికే 30 కార్ల బుకింగ్స్ పూర్తి అయినట్లుగా పేర్కొన్నారు. ఐరోపా పైర విమానయాన భద్రతా సంస్థ ధ్రువపత్రం కోసం తాము 2015 నుంచి ప్రయత్నిస్తున్నామని..తాజాగా అనుమతులు పొందినట్లుగా సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం.. ఈ ఎగిరే కారును.. 2022 నాటికి అందరికి అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యంగా చెబుతున్నారు. ఇప్పటివరకు రోడ్ల మీద కనిపించిన ట్రాఫిక్ జాం..రానున్న ఏళ్లలో ఆకాశంలో జాం ఏర్పడుతుందేమో?