Begin typing your search above and press return to search.

ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హ‌ణ మాకే రిస్క్‌: తేల్చిచెప్పిన‌ ఆస్ట్రేలియా

By:  Tupaki Desk   |   30 May 2020 12:30 AM GMT
ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హ‌ణ మాకే రిస్క్‌: తేల్చిచెప్పిన‌ ఆస్ట్రేలియా
X
అక్టోబర్‌, న‌వంబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా వేయ‌డం ఖాయ‌మే. అయితే దీనిపై కొన్ని దేశాలు, ముఖ్యంగా పాక్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా స్పందించింది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హిస్తే త‌మ దేశానికే అత్యంత ప్రమాదకరమ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీఈఓ కెవిన్ రోబర్ట్స్ తెలిపారు. 16 దేశాల‌ క్రికెట్ జట్లని ఆస్ట్రేలియాలోకి అనుమతించడం చాలా రిస్క్‌తో కూడుకున్నదని పేర్కొన్నారు. ఆటగాళ్ల రక్షణ, హోటల్, ప్రయాణం లాంటివి ఏర్పాటు చాలా కష్టమ‌ని వివ‌రించారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు టీ20 ప్రపంచకప్‌ జరగడం క‌ష్ట‌మ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. వాయిదాపై సూత్ర‌ప్రాయ అంగీకారం వ‌చ్చింది. కానీ ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.
దీనిపై 15 రోజుల్లో ఓ స్ప‌ష్ట‌త రానుంది.

మహమ్మారి వైరస్ ప్ర‌పంచంపై తీవ్రంగా వ్యాపించి అన్ని దేశాల్లో విప‌త్క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఈ స‌మ‌యంలో ఈ మెగా టోర్నీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) 2022కు వాయిదా వేయాల‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. అన్ని దేశాల బోర్డు సభ్యులతో ఈ ప్రపంచకప్‌ నిర్వహణపై ఐసీసీ మరోసారి (జూన్ 10వ తేదీ తర్వాత) చర్చించ‌నుంది. అనంత‌రం దీనిపై తుది నిర్ణయం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తుంటే ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా ప‌డేలా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

వైరస్ కారణంగా ఒక్క క్రికెటే కాదు అన్ని క్రీడా కార్య‌క్ర‌మాలు ర‌ద్ద‌వ‌డం.. వాయిదా వేయ‌డం వంటివి జ‌రిగాయి. ప్ర‌స్తుతం క్రీడాలోకం స్తబ్దుగా కొన‌సాగుతోంది. ఈ క్రమంలోనే అత్యంత ప్రేక్ష‌కాద‌ర‌ణ క‌లిగిన ఐపీఎల్ ఏప్రిల్ 29వ తేదీన ప్రారంభం కావాల్సి ఉండ‌గా నిరవధిక వాయిదా పడిన విష‌యం తెలిసిందే. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితే టీ20 ప్రపంచకప్ వాయిదా పడిన సంద‌ర్భంలో అక్టోబర్లో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. అయితే దీనిపై కూడా అన్ని దేశాల బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ఆస్ట్రేలియాలో మ‌హ‌మ్మారి వైరస్ త‌క్కువ‌నే ఉంది. కేవ‌లం 7,165 కేసులు న‌మోదు కాగా, 6,580 మంది కోలుకున్నారు. 103 మంది మాత్రమే చనిపోయారు. ప్ర‌స్తుతం వైర‌స్ నుంచి దేశం సుర‌క్షితంగానే ఉంది. కానీ ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హిస్తే ప్రేక్ష‌కుల‌తో పాటు ఆటగాళ్ల రాక‌తో వైర‌స్ వ్యాప్తి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆలోచించి ఈ మేర‌కు ఆస్ట్రేలియా ప్ర‌పంచ‌కప్ నిర్వ‌హ‌ణ‌కు వెనుకంజ వేసింది.