Begin typing your search above and press return to search.

ప్రపంచ బ్యాంకు కరుణ: భారత్‌ కు భారీ సాయం

By:  Tupaki Desk   |   3 April 2020 8:30 AM GMT
ప్రపంచ బ్యాంకు కరుణ: భారత్‌ కు భారీ సాయం
X
కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారతదేశంపై ప్రపంచ బ్యాంక్‌ కరుణ చూపింది. కరోనాపై పోరుకు ప్రపంచ బ్యాంకు భారత్‌ కు బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,600 కోట్లు) అత్యవసర సాయం ప్రకటించింది. భారతదేశం చేసిన విజ్ఞప్తికి ప్రపంచ బ్యాంకు స్పందించి ఈ మేరకు సహాయం అందించింది. బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల సమావేశం గురువారం జరగ్గా కరోనా మహమ్మారిపై తీవ్రంగా చర్చించారు. కరోనా నివారణకు ప్రపంచ సంస్థగా ఉన్న తాము ఏం చేయాలనేది దానిపై చర్చించారు. ఆ క్రమంలోనే భారత్‌ చేసిన విజ్ఞప్తిని పరిశీలించారు. సమావేశం అనంతరం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు కరోనా వైరస్‌ తో ప్రభావితమవుతున్న ప్రపంచంలోని 25 దేశాలకు సహాయం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మొత్తం 25దేశాలకు 1.9 బిలియన్‌ డాలర్ల అత్యవసర సాయం ప్రకటించింది. వాటిలో అత్యధికంగా భారత్‌ కు 1 బిలియన్‌ డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు ప్రకటించారు.

స్క్రీనింగ్‌ - కాంటాక్ట్‌ కేసుల ట్రేసింగ్‌ - లేబొరేటరీ డయాగ్నోస్టిక్స్‌ - వైద్యులకు పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌ మెంట్‌ - నూతన ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు కోసం ఈ నిధులు ఇస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ ప్రకటించింది. ఆ 25 దేశాల్లో భారతదేశానికి సింహభాగం ప్రకటించడం విశేషం. కరోనాతో పోరాడుతూ దేశాన్ని పూర్తిగా స్తంభించడంతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్‌ సహాయం ప్రకటించడంతో కొంతలో కొంత భారతదేశానికి ఊరట లభించింది. అయితే కరోనా ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ప్రస్తుతం ఒడిదుడుకులతో కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్‌ నివారణ చర్యలు - ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి - ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వచ్చే 15 నెలల్లో 160 బిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ పై ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ మొత్తాన్ని దారిద్య్ర నిర్మూలనపై - నిరుపేదలను ఆదుకునేందుకు - పర్యావరణ పరిరక్షణకు ఖర్చు చేస్తామని వెల్లడించింది.

పలు దేశాలకు ప్రపంచ బ్యాంక్‌ సహాయం ఇలా..

పాకిస్తాన్‌ కు 200 మిలియన్‌ డాలర్లు
ఆఫ్గనిస్థాన్‌ కు 100 మిలియన్‌ డాలర్లు
మాల్దీవులకు 7.3 మిలియన్‌ డాలర్లు
శ్రీలంకకు 128.6 మిలియన్‌ డాలర్లు