Begin typing your search above and press return to search.

సొంత వీర్యంతో మహిళలకి గర్భం..ఆ తర్వాత ఏమైందంటే

By:  Tupaki Desk   |   16 Sep 2021 10:30 AM GMT
సొంత వీర్యంతో మహిళలకి గర్భం..ఆ తర్వాత ఏమైందంటే
X
గర్భవతిని చేసేందుకు ఓ ఫెర్టిలిటీ డాక్టర్ దాతల నుంచి సేకరించిన వీర్యం కాకుండా, రహస్యంగా సొంత వీర్యాన్ని వినియోగించాడని అమెరికాకు చెందిన ఓ మహిళ కోర్టు కి ఎక్కింది. పలువురు మహిళలకు సైతం సొంత వీర్యాన్నే ఉపయోగించి గర్భం వచ్చేలా చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు డాక్టర్ మోరిస్ వోర్ట్ మన్ అనే వైద్యుడి పై న్యూయార్క్‌ కు చెందిన మహిళ కేసు దాఖలు చేశారు. 1980లలో దాతల నుంచి సేకరించిన వీర్యంతో ఓ మహిళ గర్భం దాల్చారు. రోచెస్టర్కు చెందిన మోరిస్ వోర్ట్మన్ అనే వైద్యుడు ఆమెకు ఈ చికిత్స అందించి గర్భం దాల్చేలా చేశారు.

స్థానిక వైద్య విద్యార్థి నుంచి సేకరించిన వీర్యాన్ని చికిత్సలో ఉపయోగించానని ఆ వైద్యుడు తెలిపారు. అయితే, నిజానికి అది మోరిస్ సొంత వీర్యమేనని, అప్పుడు జన్మించిన ఆ మహిళ కుమార్తె ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. దీనిపైనే కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళ ప్రస్తుతం ఇదే వైద్యుడి వద్ద గైనకాలజీ చికిత్స తీసుకుంటున్నారు. 1985లో తాను జన్మించినట్లు పేర్కొంటున్న ఆ మహిళ.. డీఎన్ ఏ జీనాలజీ పరీక్ష చేయించుకుంటే తనకు తొమ్మిది మంది తోబుట్టువులు ఉన్నట్లు తేలిందని ఆమె వివరించారు. ఈ వ్యవహారంపై వైద్యుడు వోర్ట్మన్ ఇప్పటివరకూ స్పందించలేదు. ఆయన తరఫున మాట్లాడే న్యాయవాది వివరాలు సైతం వైద్యుడి కార్యాలయం వెల్లడించలేదు.

నిజానికి, గత కొన్నేళ్లలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇతరుల వీర్యం కాకుండా, సొంత వీర్యాన్ని చికిత్సలో ఉపయోగిస్తున్నారని కొందరు వైద్యులపై ఆరోపణలు వస్తున్నాయి. దాతల నుంచి సేకరించిన వీర్యం ద్వారానే చికిత్స అందిస్తున్నానని చెప్పిన ఇండియానాకు చెందిన వైద్యుడు డొనాల్డ్‌ క్లైన్‌ పదుల సంఖ్యలో మహిళలకు సొంత వీర్యాన్ని వినియోగించాడు. అనంతరం ఈ విషయం వెలుగులోకి రావడంతో తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు అతడి లైసెన్సును ఏడాది పాటు రద్దు చేసింది. నెవాడాలో జరిగిన ఇలాంటి ఉదంతంపై హెచ్బీఓలో బేబీ గాడ్ అనే డాక్యుమెటరీ సైతం వచ్చింది.