Begin typing your search above and press return to search.

కేర‌ళ‌లో దారుణం: యూట్యూబ్ ద్వారా భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త

By:  Tupaki Desk   |   25 May 2020 11:10 AM GMT
కేర‌ళ‌లో దారుణం: యూట్యూబ్ ద్వారా భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త
X
సోషల్‌ మీడియా స‌మాజానికి చేటుగా మారుతోంది. వినోదం.. కాల‌క్షేపం కోసం ఉండాల్సిన సామాజిక మాధ్య‌మాలు ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టిస్తున్నాయి. వాటిని నెటిజ‌న్లు దుర్వినియోగం చేస్తున్నాయి. స‌మాజానికి చేటు తెచ్చేలా వారి వ్య‌వ‌హారం ఉంది. సోష‌ల్ మీడియా స‌హాయంతో ప్ర‌జ‌లు నేరాల‌కు పాల్ప‌డుతున్న సంఘ‌ట‌న‌లు ఎన్నో చూశాం. తాజాగా కేర‌ళలో యూట్యూబ్ స‌హాయంతో త‌న భార్య‌ను హ‌త్య చేసిన సంఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. అయితే అత‌డు ఎందుకు హ‌త్య చేశాడ‌ని తెలిస్తే అంద‌రూ షాక్‌కు గుర‌వాల్సిందే. భార్య ఆభరణాలు, ఆమె పేరు మీద ఉన్న బ్యాంకు డిపాజిట్లను సొంతం చేసుకోవడానికే ఆమెనే హ‌త‌మార్చాడు. అయితే ఆమెను చంప‌డానికి అత‌డు ఎంచుకున్న మార్గం కూడా షాకింగ్‌గా ఉంది. రెండుసార్లు భార్య‌పై పాములను వదిలాడు. రెండుసార్లు ఆమె పాముకాటుకు గురి కాగా రెండోసారి ఆమె మృతిచెందింది.

కేరళలోని కొల్లం జిల్లాకు ఆంచల్ గ్రామానికి చెందిన ఉత్రాకు పత్తినంథిట్ట జిల్లా ఆడూర్‌కు చెందిన సూరజ్‌తో వివాహమైంది. సూరజ్ తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో ఉత్రా తల్లిదండ్రులు భారీగా కట్నకానుక‌లు ఇచ్చారు. దీంతోపాటు ఆమె పేరు మీద బ్యాంకుల్లో డిపాజిట్ భారీగా చేశారు. అయితే క‌ట్నం డ‌బ్బులు సూరజ్ చేతికి ఇవ్వలేదు. మొత్తం తమ కుమార్తె పేరు మీదే బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. దీంతో అత‌డికి కోపం వ‌చ్చింది. దీనిపై భార్యతో గొడ‌వ‌ప‌డేవాడు. ‌అదనపు కట్నం కోసం ఆమెను వేధించ‌సాగాడు. చివ‌ర‌కు ఆమెను హ‌త్య చేయాల‌ని భావించాడు. భార్య ఉత్ర మరణిస్తే ఆమె పేరు మీద ఉన్న బ్యాంకు డిపాజిట్లు, ఆభ‌ర‌ణాలు తనకు దక్కుతాయని ఆశించాడు.

ఆమె ఎలా చంపాల‌ని అనే దానిపై తీవ్రంగా ఆలోచించాడు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో వెతికాడు. పాములతో ఎలా కాటు వేయించాలనే విషయమై సూరజ్ మూడు నెలల పాటు యూట్యూబ్‌లో చూశాడు. వాటికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో క్రమం తప్పకుండా చూశాడూ. చివ‌ర‌కు ఆమెను పాముకాటుతో చంపేయాల‌ని నిర్ణ‌యించి అమ‌లుచేశాడు.

ప్లాన్‌లో భాగంగా అతను రూ.10 వేలు ఖర్చు చేసి రెండు పాముల‌ను కొన్నాడు. తిరువనంతపురంలో ఉన్న భార్యను ఆడూర్‌లోని సొంతింటికి తీసుకెళ్లాడు. మార్చి 22వ తేదీన ఆమెను పాముకాటు వేసేలా చేశాడు. ఆ స‌మ‌యంలో ఆమెను రక్షించినట్లు భ‌ర్త నటించాడు. వెంట‌నే ఆమెను కాపాడి ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. ఆమెకు స‌ప‌ర్య‌లు చేసి ఏమీ తెలియ‌న‌ట్టు న‌టించాడు. ఆమె కోలుకుని ఇంటికి వ‌చ్చాడు. అనంతరం భార్యను కొల్లం జిల్లాలోని ఆంచల్ గ్రామానికి తీసుకెళ్లాడు. ఈ నెల 6వ తేదీన పుట్టింట్లో ఆమె నిద్రిస్తుండగా పామును విడిచి పెట్టాడు. రెండోసారి పాముకాటుకు గురై భార్య ఉత్ర మరణించింది.
దీంతో అత‌డు మ‌ళ్లీ త‌న నాట‌కం మొద‌లుపెట్టాడు. ఆమె అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. అయితే ఈ స‌మ‌యంలోనే కుటుంబ‌స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చింది. రెండుసార్లు పాముకాటుకు గురికావడంపై కుటుంబీకులు ఈ నెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచార‌ణ చేప‌ట్టాగా అసలు విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది. రెండుసార్లు ఉత్ర పాముకాటుకు గురికావడానికి భర్తే కారణమని నిర్ధారించారు. సూరజ్ సహా పాములను విక్రయించిన వ్యక్తితో పాటు ఉత్రను హత్య చేయడానికి సహకరించిన మరొకరిని అరెస్టు చేశారు. ఈ విధంగా సోష‌ల్ మీడియాను వినియోగించుకుని భార్య‌ను హ‌త్య చేసిన సంఘ‌ట‌న తెలుసుకుని కుటుంబ‌స‌భ్యులు షాక్‌కు గుర‌య్యారు. అత‌డిలో ఇంత ఆక్రోశం.. డ‌బ్బుపై అత్యాశ ఉంద‌ని గుర్తించి ఖంగుతిన్నారు. డ‌బ్బుపై దురాశ ఎంత‌టి అఘాయిత్యానికైనా దారి తీస్తుంద‌ని ఈ ఘ‌ట‌న‌తో మ‌రోసారి రుజువైంది.