తమిళనాట 37 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఇప్పుడెందుకు సంచలనం?

Mon Jul 06 2020 06:00:01 GMT+0530 (IST)

Woman Constable gives Statement on about Custodial Deaths

దేశం మొత్తం ఇప్పుడామె గురించి మాట్లాడుకుంటుంది. ఇంతకీ ఆ మహిళా కానిస్టేబుల్ ఏం చేశారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. పెద్ద సాహసమే చేశారని చెబుతారు. నిజాంగానా? అంటే.. ఆమె నిజం చెప్పారని మాత్రమే చెప్పాలి. నిజం చెబితే.. ఇంతటి అభినందనలా? అంటే అవుననే చెప్పాలి. పోలీసు శాఖలో నిజాన్ని నిర్భయంగా చెప్పటం.. అది కూడా ఉన్నతాధికారులు చేసిన తప్పుల్ని కోర్టుకు చెప్పటానికి మించిన సాహసం ఏముంటుంది?తమిళనాడుకు చెందిన తండ్రీకొడుకుల్ని తూతుక్కుడి జిల్లా సాత్తాన్ కుళమ్ పోలీసులు ఇటీవల చిత్రహింసలు పెట్టి చంపిన వైనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకీ వారు చేసిన అతి పే..ద్ద తప్పు లాక్ డౌన్ సమయానికి మించి పావుగంట పాటు అదనంగా తమ షాపును తెరిచి ఉండటమే వారు చేసిన పాపం. ఆ మాత్రం దానికే పోలీసులు చెలరేగిపోయి వారి ప్రాణాల్ని తీసేలా హింసించిన వైనం షాక్ కు గురయ్యేలా చేసింది. పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చోటు చేసుకున్నాయి.

వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి దారుణంగా హింసించారు. పోలీసు కస్టడీలో వారిద్దరూ మరణించటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దీనిపై దర్యాప్తు సాగుతున్నా.. అందుకు తగ్గ సాక్ష్యాలు లభించలేదు. అందుకు కారణం.. ఆ స్టేషన్ లో సీసీ కెమేరాలు లేకపోవటమే. కాకుంటే.. అక్కడే డ్యూటీ చేసిన 37 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ మాత్రం స్టేషన్ లో ఏం జరిగిందన్న విషయాన్ని న్యాయమూర్తికి పూసగుచ్చినట్లు చెప్పటంతో ఈ మొత్తం వ్యవహారం మరో మలుపు తిరిగింది.

దీంతో.. ఇద్దరు అమాయకుల ప్రాణాలు పోయేందుకు కారణమైన పోలీసు సిబ్బందిపై చర్యలతో పాటు.. వారిపై హత్యానేరం నమోదు కావటానికి ఆమె ఇచ్చిన సాక్ష్యమే ఆధారంగా నిలిచింది. ఆమె తెగువకు.. నిజాయితీని పలువురు అభినందిస్తున్నారు. కానీ.. ఉన్నతాధికారులు తనను లక్ష్యంగా చేసుకుంటారన్న భయాందోళనలకు గురవుతున్నారు. ఈ కారణంతోనే ఆమె తన పేరును ఎక్కడా బయటపెట్టొద్దని కోరుతోంది.

ఇదిలా ఉంటే.. ఆ మహిళా పోలీసుకు అవసరమైన రక్షణ కల్పించాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అప్పటివరకూ సాత్తాన్ కుళమ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించిన ఆమెను అధికారులు రిలీవ్ చేసి.. వేరే చోట విధుల్లో చేరటానికి ఆదేశాలు ఇచ్చారు. కానీ.. భర్తతో పాటు విధుల్లో చేరేందుకు జంకుతున్నారు. మరి.. ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఏమైనా తన కళ్లెదుట జరిగిన దారుణాన్ని గుండెల్లో దాచుకోకుండా కోర్టు ముందుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చిన వైనాన్ని మాత్రం అభినందించాల్సిందే.