Begin typing your search above and press return to search.

కరోనా సోకినా.. ఒమిక్రాన్ దెబ్బకే ఛాన్సు ఎక్కువట

By:  Tupaki Desk   |   4 Dec 2021 3:24 AM GMT
కరోనా సోకినా.. ఒమిక్రాన్ దెబ్బకే ఛాన్సు ఎక్కువట
X
ప్రపంచానికి కొత్త టెన్షన్ గా మారింది ఒమిక్రాన్ వేరియంట్. ఇప్పటివరకు వచ్చిన వేరియంట్లలో అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే డెల్టా సైతం ఒమిక్రాన్ ముదురు తెలివితేటల ముందు బలాదూరేనని చెబుతున్నారు. డెల్టా వేరియంట్ లో రోగి ప్రాణాల మీదకు తీసుకొచ్చే గుణం ఎక్కువగా ఉంటుంది. ఒమిక్రాన్ విషయానికి వస్తే.. ప్రాణాలు తీసే కార్యక్రమంలో దీని జోరు తక్కువ కానీ.. అదే పనిగా వ్యాపిస్తూ.. చాలా తక్కువ వ్యవధిలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే తీరు ఒమిక్రాన్ కు ఎక్కువని చెబుతున్నారు.

చూస్తున్నంతనే వారం.. పది రోజుల వ్యవధిలోనే దాదాపు 30 దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ కు సంబంధించిన కీలకాంశాల్ని వెల్లడించింది దక్షిణాఫ్రికాలోని విట్ వాటర్స్ రాండ్ విశ్వ విద్యాలయం. ఇప్పటికే కరోనా బారిన పడి.. కోలుకున్న వారికి ఒమిక్రాన్ వేరియంట్ సోకదని భావిస్తే అది తప్పే అవుతుందని స్పష్టం చేస్తున్నారు. అలాంటి అపోహలు వద్దన్న విషయాన్ని స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇప్పటికే కరోనా బారిన పడినప్పుడు.. దాని తాలూకు రక్షణ వ్యవస్థను ఏమార్చటంలో కొత్త వేరియంట్ తెలివి అమోఘమని చెబుతున్నారు. డెల్టాతో సహా ఇతర వేరియంట్ల బారిన పడినోళ్లు సైతం దీని బారిన పడతారని చెబుతున్నారు. ఒమిక్రాన్ కు బురిడీ కొట్టించే తెలివితేటలు ఎక్కువని.. ఈ కారణంగా గతంలో పాజిటివ్ అయిన వేళ వచ్చే రక్షణ వ్యవస్థను ఒమిక్రాన్ ఏమారుస్తుందని చెబుతున్నారు. ఇలాంటి ముదురు తెలివితేటలున్న ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.