ఏసీ వాడకంతో ఇల్లు గుల్ల అవుతుందా..? ఇలా చేయండి!

Tue May 04 2021 07:00:01 GMT+0530 (IST)

Will the house be shelled with the use of AC

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ఎండాకాలం చలికాలం అనే తేడా లేకుండా ఏసీల వాడకం పెరిగిపోయింది. ఇక వేసవిలో భానుడి భగభగల వల్ల నిరంతరాయంగా ఏసీ ఆన్లో ఉంటుంది. ఫలితంగా విద్యుత్ బిల్లు తడిసి మోపెడవుతుంది. అంతేకాకుండా దీనివల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీల మితిమీరిన వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ వివరించింది. ఏసీల్లో ఎక్కువ సమయం ఉండడం శ్రేయస్కారం కాదని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. కాగా 10 గంటల పాటు ఏసీ ఆన్ చేస్తే 10 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుందని తెలిపారు.  ఏటా ఏసీల వార్షిక విద్యుత్ డిమాండ్ 2800మిలియన్ యూనిట్లు అని వెల్లడించారు. ఏసీలు తక్కువ ఉష్ణోగ్రత వద్ద పని చేస్తే కంప్రెషన్ నిరంతరం పని చేయాలి. దానివల్ల అధిక విద్యుత్ ఖర్చు అవుతుందని తెలిపారు. ఎప్పుడూ 26 డిగ్రీల పైన ఉంచితే కరెంట్ ఆదా అవుతుందన్నారు. ఒక్కో ఏసీకి కనీసం 5 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. 10 లక్షల ఇళ్లలో రోజుకూ 5 మిలియన్ యూనిట్లు పొదుపు చేయవచ్చని వెల్లడించారు.

ఏసీలను 26 డిగ్రీల ఉష్ణోగ్రత స్థాయిలో వాడుకుంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా మేలు అని సూచిస్తున్నారు. ఐదు నక్షత్రాల ఏసీలు వాడడం వల్ల రోజుకూ 5యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. ఏడాదిలో ఒక్క నక్షత్రం ఉన్న ఏసీతో 665 యూనిట్లు పొదుపు చేస్తే 5 నక్షత్రాలతో 2500 వరకు చేయవచ్చని అంచనా వేశారు. గదిలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే అనేక రకాల వ్యాధులు వస్తాయని తెలిపారు. శరీర ఉష్ణోగ్రత కన్నా తక్కువ అనగా 19 నుంచి 21 వరకు ఉంటే వివి రకాల అలర్జీలు అధిక రక్తపోటు వస్తుందని హెచ్చరించారు.

ఏసీ ఉష్ణోగ్రత సెట్టింగుల్లో ఒక డిగ్రీ తగ్గితే 6శాతం విద్యుత్ వాడకం తగ్గుతుందని అన్నారు. ఇక 5 నక్షత్రాలు ఉంటే అది ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. వినియోగదారులు సాధ్యమైనంత వరకు 5 నక్షత్రాల ఏసీలను కొనేలా అవగాహన కల్పించాలని ఆ శాఖ యోచిస్తోంది. అంతేకాకండా వాటిని 26 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వాడాలని సూచిస్తోంది. 2030 వరకు దేశంలో కనెక్టెడ్ లోడ్ 200 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. కాబట్టి ఏసీల వల్ల ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఏర్పడుతాయని హెచ్చరించారు.