కేంద్రం డిజైన్ ప్రకారమేనట... పోలవరం ఎత్తు తగ్గిస్తారా...?

Thu Sep 29 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Will the height of Polavaram be reduced

ఏపీకి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా ఉన్న పోలవరం విషయంలో కేంద్రం అనుకున్నట్లే అంతా జరుగుతోందా అంటే జవాబు అవును అనే చెప్పాలేమో. కేంద్రం డిజైన్ చేసిన మేరకే పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మించడానికి ఏపీ సర్కార్ అంగీకారం తెలిపింది. ఢిల్లీలో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఆద్వర్యాన జరిగిన సమావేశానికి ఏపీ తెలంగాణా ఒడిషా చత్తీస్ ఘడ్ రాష్ట్రాల  నుంచి అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు లేవనెత్తిన కీలకమైన ప్రశ్న పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తమ వైపు ఉన్న ప్రాంతాలు మునిగిపోతాయని ముంపునకు గురి అవుతాయని. దానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ ఆర్‌కే గుప్తా చెప్పినది ఏంటి అంటే అలాంటిది ఏమీ జరగదని కేంద్రం చెప్పిన డిజైన్ మేరకే పోలవరం ప్రాజెక్ట్ రూపకల్పన జరుగుతుందని.

ఇదే సమావేశంలో ఏపీ అధికారులు కూడా అదే విషయం మీద ఓకే చెప్పారు. అయినా సరే ఛత్తీస్‌గఢ్ తెలంగాణ తమ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాలను అంచనా వేయడానికి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లను సంయుక్తంగా తనిఖీ చేసి సర్వే చేయాలని కోరడం ఇక్కడ గమనార్హం. సాటి తెలుగు రాష్ట్రం సర్వే అంటున్నా మరో పొరుగు రాష్ట్రం ఒడిషా మాత్రం సంప్రదింపుల ద్వారనే ఏపీలో ఈ ముంపు సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పడం విశేషం.

ఇవన్నీ పక్కన పెడితే ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌కు సహకరించాలని ఒడిశా తెలంగాణ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అభ్యర్థించామని అథారిటీ చైర్మన్ ఆర్‌కే గుప్తా మీడియాకు చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని కేంద్రానికి ఇతర రాష్ట్రాలు సహకరించాలని కూడా ఆయన కోరారు. మొత్తానికి ఈ అభ్యంతరాలు ఎలా పరిష్కారం అవుతాయో తెలియదు కానీ పోలవరం కేంద్ర డిజైన్ల ప్రకారం అంటే కాస్తా ఆలోచించాల్సిందే అంటున్నారు.

పోలవరం ఎత్తుని ఇంచ్ కూడా తగ్గించే ప్రసక్తి లేదని ఆ మధ్యన నిండు సభలో సీఎం జగన్ చెప్పారు. దాని కంటే ముందు విపక్షలౌ  పోలవరం ఎత్తు తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపించాయి. ఎత్తు అనుకున్న దాన్ని నుంచి తగ్గిస్తే పోలవరం కట్టినా ఉపయోగం లేదని కూడా విపక్షాలు అంటున్నయి. ఇక ఎత్తు తగ్గిస్తే ఆ మేరకు నిధులు ఖర్చు చేసే బాధ్యత కూడా తగ్గుతుంది. మరి కేంద్రం ఆలోచనలు ఎలా ఉన్నాయో కానీ పోలవరం ప్రాజెక్ట్ ని అనుకున్నట్లుగా నిర్మిస్తేనే తప్ప  బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ ప్రయోజనాలు అందే అవకాశమైతే లేదు అనే చెప్పాలి.

ఇక ఏపీ సర్కార్ అయితే పోలవరం  ప్రాజెక్టులో ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను  కేంద్ర ప్రభుత్వానికి అలాగే  పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అప్పగించింది. దాంతో కేంద్రం డిజైన్లు అంటే పోలవరం విషయంలో ముందే అనుకున్నవా లేక ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్ట్  ఎత్తును ఏ మేరకైనా తగ్గిస్తారా అన్నదే చర్చగా ఉంది మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.