Begin typing your search above and press return to search.

మోడీ ఏం చేసినా ఐదురాష్ట్రాల ఎన్నికల ఎజెండానే ఉంటుందా?

By:  Tupaki Desk   |   1 March 2021 2:30 PM GMT
మోడీ ఏం చేసినా ఐదురాష్ట్రాల ఎన్నికల ఎజెండానే ఉంటుందా?
X
మోడీ మాటలు.. చేతలు అన్ని స్క్రిప్టు రాసినట్లుగా సాగుతుంటాయి. అందరి మనసుల్ని దోచేలా.. వంక పెట్టేందుకు వీల్లేని రీతిలో ఆయన నిర్ణయాలు ఉంటాయి. సునిశితంగా పరిశీలిస్తే.. దాని వెనుకున్న లెక్కలు ఆసక్తికరంగా కనిపిస్తుంటాయి. కావాలని చేస్తారో.. అనుకోకుండా అలా కుదిరిపోతాయో కానీ.. గడిచిన రెండు రోజులుగా మోడీ మాటలు.. చేతల్ని చూస్తే.. రానున్న కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలు కనిపించటమే కాదు.. తాము టార్గెట్ చేసిన రాష్ట్రాలే ప్రముఖంగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

నిన్నటి మన్ కీ బాత్ చూస్తే.. ప్రధాని మాటల్లో తమిళనాడు ప్రముఖంగా కనిపించింది.. వినిపించింది. తమిళం నేర్చుకోకపోవటంతో తాను బాధ పడుతున్నట్లుగా వ్యాఖ్యానించటమే కాదు.. తమిళనాడుకు చెందిన ఉదాహరణల్ని ఆయన ప్రస్తావించారు. ఈ రోజు ఉదయం ఎవరికి చెప్పకుండా.. ఏ మాత్రం ముందుగా ప్లాన్ చేయకుండా.. అన్ ప్లాన్డ్ గా టీకా వేసుకోవాలన్న నిర్ణయాన్ని ప్రధాని తీసుకోవటం తెలిసిందే.

ఈ ఉదయం వ్యాక్సిన్ వేసుకునేందుకు తెల్లవారుజామున ఢిల్లీలోని ఎయిమ్స్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మెడలో అసోంకు చెందిన కండువాను ధరించారు. అసోం మహిళల ఆశీస్సులు తనకు ఉన్నాయన్న పేరుతో ఆ కండువాను ధరిస్తే.. ఆయనకు వ్యాక్సిన్ వేసిన నర్సు సిస్టర్ నివేదా పుదుచ్చేరికి చెందిన వారు. టీకా వేస్తున్న నర్సుకు సహాయంగా ఉన్న మరో నర్సు కేరళకు చెందిన వారు కావటం గమనార్హం. ఇక.. ప్రధాని వేయించుకున్న వ్యాక్సిన్ చూస్తే తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కావటం విశేషం.

ఇప్పటివరకు వ్యాక్సినేషన్ జరిగినంత వరకు సింహభాగం సీరం సంస్థకు చెందిన వ్యాక్సిన్ వేసుకోగా.. మోడీ మాత్రం అందుకు భిన్నంగా హైదరాబాద్ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ వేసుకోవటం ద్వారా.. మేకిన్ ఇండియాకు తన ప్రాధాన్యత ఏమిటన్నది చెప్పకనే చెప్పేశారు.

ఇక.. వ్యాక్సిన్ వేసేందుకు వీలుగా ఎయిమ్స్ లో ఎలాంటి ఏర్పాట్లు చేశారంటూ అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంజెక్షన్ తీసుకున్న సందర్భంగా ఆయన కాసేపు అక్కడే గడిపారు. తన వివరాల్ని స్వయంగా రాసిన మోడీ.. తర్వాత వెళ్లిపోయారు. దేశంలో రెండో దశ టీకా కార్యక్రమంలో కరోనా వారియర్స్.. ఫ్రంట్ లైన్ వర్కర్ల తర్వాత టీకా తీసుకున్న సాధారణ వ్యక్తిగా ప్రధాని మోడీ నిలవటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు తాజాగా ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్ని కవర్ చేశారని చెప్పాలి..ఒక్క బెంగాల్ తప్ప.