శివసేన ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గుతుందా?

Wed Jun 29 2022 11:14:13 GMT+0530 (IST)

Will the Shiv Sena government win the by-elections?

మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తీసుకున్నాయి. దాదాపు 40 రెబల్ ఎమ్మెల్యేలు శివసేన సీనియర్ నేత ఏకనాథ్ షిండేతో కలసి అసోంలోని గౌహతిలో క్యాంప్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి.. బల నిరూపణ చేయాలని ఉద్ధవ్ సర్కార్ కు ఆదేశాలు జారీ చేశారు. అది కూడా జూన్ 30 సాయంత్రం 5 గంటల వరకే గడువిచ్చారు.ఈలోపు తనకు సరిపోనూ బలం ఉందని అసెంబ్లీలో నిరూపించుకోవాలని.. అలాగే ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డు చేయాలని సూచించారు. దీంతో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ విశ్వాస పరీక్షలో ఎలా నెగ్గాలా అని మల్లగుల్లాలు పడుతోంది.

మరోవైపు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఇప్పటికే భేటీ అయ్యారు. అలాగే శివసేన రెబల్ నేత ఏకనాథ్ షిండేతోనూ రహస్యంగా చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. అలాగే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బలం నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే సర్కారును కోరాలని ఆయనకు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఉద్ధవ్ సర్కారుకు జూన్ 30 వరకు గడువు ఇచ్చారని అంటున్నారు.

మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి అసోంలోని గౌహతిలోనే ఉన్నారు. 40 మంది శివసేన ఎమ్మెల్యేలకు తోడు దాదాపు 10 స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా వారితోనే ఉన్నారని సమాచారం. ఈ 40 మంది రెబల్ ఎమ్మెల్యేల్లోనే 9 మంది శివసేన మంత్రులు కూడా ఉన్నారు. వీరి శాఖలను కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వేరే మంత్రులకు కేటాయించిన సంగతి తెలిసిందే. అయినా రెబల్ నేతలు దారికి రాలేదు.

ఇప్పుడు విశ్వాసపరీక్ష నేపథ్యంలో వారంతా ముంబై వస్తారా? లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. శివసేన సంకీర్ణ సర్కారు విశ్వాస పరీక్ష పూర్తయ్యాక తమ కార్యాచరణను అమలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వకపోతే ఉద్ధవ్ సర్కారు కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ఎమ్మెల్యేల బలం 155. ఇందులో 40 మంది శివసేన ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారారు.

ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సింది 144 మంది ఎమ్మెల్యేలు. అయితే ఇంతమంది సంకీర్ణ సర్కారుకు లేరు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఎందుకంటే బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి 40 మంది రెబల్స్ 10 మంది స్వతంత్రులు తోడయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఉద్దవ్ సర్కారు ఉంటుందో? ఊడుతుందో జూన్ 30న గురువారం తేలిపోనుంది.