Begin typing your search above and press return to search.

ఎన్నికలు వాయిదా పడతాయా ?

By:  Tupaki Desk   |   17 Jan 2022 5:25 AM GMT
ఎన్నికలు వాయిదా పడతాయా ?
X
పంజాబ్ లో ఎన్నికలు వాయిదా పడతాయా ? పడవా ? అనే అంశంపైనే చర్చ పెరిగిపోతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలై వేడి బాగా రాజుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఎన్నికలను వారంరోజులు వాయిదా వేయాలంటు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాయటం సంచలనంగా మారింది. ప్రభుత్వం రాసిన లేఖకు బీజేపీ మద్దతివ్వటంతో ఇపుడు ఎన్నికల వాయిదా విషయంపైనే చర్చ జరుగుతోంది.

అసలు ఎన్నికలు ఎందుకని వాయిదా వేయాలి ? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లోని బెనారస్ లో ఫిబ్రవరి 10-16 తేదీల మథ్య రవి గురుదాస్ జయంతి జరగబోతోందట. ఆ ఉత్సవాలకు పంజాబ్ నుండి బెనారస్ కు సుమారుగా 20 లక్షల మంది షెడ్యూల్డ్ తెగల భక్తులు వెళతారని అంచనా. గురుదాస్ భక్త సంఘాలు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఎన్నికలను వారం రోజులపాటు వాయిదా వేస్తే తమకు ఓట్లు వేసేందుకు అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశాయి. ఆ విజ్ఞప్తినే చన్నీ కమీషన్ కు లేఖ రాశారు.

పంజాబ్ లో ఉన్నదే 117 సీట్లు. అందుకని ఒకేసారి ఎన్నికలు జరపటానికి కమీషన్ డిసైడ్ చేసింది. అన్నీ సీట్లకు ఫిబ్రవరి 14వ తేదీన ఒకే ఫేజ్ లో ఎన్నికలు జరపటానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ దశలో ఎన్నికల వాయిదాకు ముఖ్యమంత్రి లేఖ రాయటం గమనార్హం. అయితే ప్రభుత్వం రాసిన లేఖకు బీజేపీ కూడా మద్దతు పలికింది. ఒకేసారి 20 లక్షల మంది ఓటర్లు బయటప్రాంతాలకు వెళుతున్నారు కాబట్టి వారి కోరిక మేరకు ఎన్నికను వారం రోజులు వాయిదా వేయాలని బీజేపీ కూడా కోరింది.

మొత్తానికి ఎన్నిక వాయిదా విషయంలో మాత్రం కాంగ్రెస్, బీజేపీలు ఏకమైనందుకు సంతోషించాల్సిందే. ఎందుకంటే ఆ రెండుపార్టీలకు 20 లక్షల ఓట్లే కనబడుతున్నాయి మరి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రీపోల్ సర్వేల్లో ఈ రెండుపార్టీలకు ఏ రకంగా చూసినా అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే తేలింది. ఇదే సమయంలో అధికారంలోకి వస్తుందని అనుకుంటున్న ఆప్ మాత్రం ఎన్నికల వాయిదాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి చివరకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఏమి నిర్ణయిస్తుందో చూడాలి.