Begin typing your search above and press return to search.

క‌డ‌ప నుంచి ఈసారి టీడీపీ త‌ర‌ఫున‌ వైఎస్ సునీత పోటీ చేస్తారా?

By:  Tupaki Desk   |   26 Jun 2022 11:30 AM GMT
క‌డ‌ప నుంచి ఈసారి టీడీపీ త‌ర‌ఫున‌ వైఎస్ సునీత పోటీ చేస్తారా?
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డ‌ప లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున దివంగత మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె వైఎస్ సునీత పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం త‌న తండ్రి హ‌త్య కేసులో దోషులెవ‌రో తేల్చాల‌ని సునీత న్యాయ‌పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ సునీత ప్ర‌ధానంగా క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంక‌ర్ రెడ్డి త‌దిత‌రులు త‌న తండ్రి హ‌త్య‌లో ప్ర‌ధాన నిందితుల‌ని ఆమె సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యంపై ఆమె హైకోర్టుకు కూడా లేఖ రాశారు. సీబీఐకి కూడా ఫిర్యాదు అందించారు.

మ‌రోవైపు త‌న పెద‌నాన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నుంచి సునీత‌కు సహ‌కారం అంద‌డం లేద‌ని గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. త‌న తండ్రి హ‌త్య కేసులో స‌హాయం కోసం వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. అవినాషే చంపించి ఉంటాడ‌ని అని ఎందుక‌నుకుంటున్నావ్.. నీభ‌ర్త న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌రరెడ్డి చంపించి ఉండొచ్చు క‌దా అని త‌న‌తో జ‌గ‌న్ అన్నార‌ని సునీత ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి.

మ‌రోవైపు వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆయ‌న కుటుంబ స‌భ్యులు (కుమార్తె, అల్లుడు) ఉన్నార‌ని వైరి వ‌ర్గం ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ సునీత టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, ఎల్లో మీడియా అధిప‌తులు చెప్పిన‌ట్టు న‌డుచుకుంటున్నార‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీగా టీడీపీ నుంచి వైఎస్ సునీత‌ను పోటీ చేయిస్తున్నార‌ని వైరి వ‌ర్గం ఆరోప‌ణ‌లు చేస్తోంది.

కాగా ప్ర‌స్తుతం క‌డ‌ప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి 2014, 2019 ఎన్నిక‌ల్లో క‌డ‌ప నుంచి వైఎస్సార్సీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. మొద‌టి నుంచి క‌డ‌ప ఎంపీ సీటు వైఎస్ కుటుంబం చేతుల్లోనే ఉంది.

1989 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వైఎస్ కుటుంబం వ్య‌క్తులే ఇక్కడి నుంచి గెలుపొందుతూ వ‌స్తున్నారు. 1989, 1991, 1996, 1998 ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గెలుపొందారు. ఆ త‌ర్వాత ఆయ‌న అసెంబ్లీకి వెళ్ల‌డంతో 1999, 2004 ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌మ్ముడు వైఎస్ వివేకానంద‌రెడ్డి క‌డ‌ప ఎంపీగా విజ‌యం సాధించారు.

ఇక 2009లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా గెలుపొందారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో మ‌రోమారు వైఎస్ జ‌గ‌న్ రికార్డు మెజారిటీతో క‌డ‌ప ఎంపీగా గెలిచారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె వైఎస్ సునీత టీడీపీ త‌రఫున బ‌రిలోకి దిగితే వైఎస్ కుటుంబ వ్య‌క్తుల మ‌ధ్యే పోటీ జ‌రిగే అవ‌కాశం ఉంది. వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ప్ర‌స్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డే మ‌రోమారు బ‌రిలోకి దిగే చాన్సు ఉంది. ఈ నేప‌థ్యంలో ఇంకా ఎన్నిక‌ల‌కు దాదాపు రెండేళ్ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ క‌డ‌ప లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం అంద‌రిలో ఆస‌క్త‌ని పెంచుతోంది.