పవర్లో ఉన్నాం.. కొండకు ఎంట్రుక వేయటం అవసరమా సారూ?

Fri Feb 26 2021 18:00:01 GMT+0530 (IST)

Will Vani Devi Be Made A Scapegoat?

అనూహ్య నిర్ణయాలు తీసుకోవటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. అయితే.. ఇంతకాలం ఆయన ఏమనుకుంటే అదే జరిగేది. అందునా.. ఎన్నికల వేళ ఆయన వ్యూహరచన చేస్తే తిరుగు ఉండేది కాదు. కాలం కలిసి రావటంతో పాటు.. చుట్టూ ఉన్న పరిస్థితులు.. పరిణామాలుఆయనకు అనువుగా ఉండేవి. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దుబ్బాకతో మొదలైన డౌన్ ట్రెండ్.. గ్రేటర్ ఎన్నికలు మరింత సుస్థిర పరిస్తే.. ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలపైనా నమ్మకం లేని పరిస్థితి.ఇలాంటి వేళ.. తీసుకునే నిర్ణయాలు.. వేసే అడుగులు ఎంత అప్రమత్తంగా ఉండాలి. విపక్షంలో ఉన్న వేళ.. కొండకు ఎంట్రుక వేయటం.. వస్తే కొండ లేకుంటే పోయేది ఎంట్రుకే కదా? అన్నట్లు కేసీఆర్ తీరు ఉండేది. ఇప్పుడు సీన్ మారిందన్నది మర్చిపోకూడదు. అధికారంలో ఉన్న వేళ.. ప్రతి ఎంట్రుక కీలకమే. ముఖ్యమైనదే. మనకు ఎంట్రుకలా అనిపించినా.. చూసేటోళ్లకు అలా ఉండదన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోకూడదు.

తాజాగా జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఏ మాత్రం కలిసి రాని హైదరాబాద్..రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పీవీ కుమార్తెను రంగంలోకి దించటం ద్వారా భారీ జూదానికి తెర తీశారు. మామూలు అభ్యర్థి గెలుపుఓటములు ఒకలా ఉంటాయి. దివంగత మాజీ ప్రధాని పీవీ కుమార్తెను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దించటం ఏమాత్రం తెలివైన పని కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

ఎందుకంటే.. ఈ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ బలం అంతంతమాత్రమే. ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఇలాంటివేళ.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికల బరిలోకి దించటం కేసీఆర్ కు సరికాదంటున్నారు. తెలంగాణ సీఎం సంధించే భావోద్వేగ అస్త్రాలకు పడిపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరని.. ఇలాంటివేళ కేసీఆర్ కు తగిన సందేశాన్ని ఇచ్చేందుకే అయినా భిన్నమైన తీర్పు ఇస్తే పరిస్థితి ఏమిటి? అన్నది క్వశ్చన్ గా మారింది. ఈ వాదనకు బలం చేకూరేలా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ కుమార్తె కవితను ఎమ్మెల్సీగా ఎన్నుకోవటానికి పార్టీ ఎమ్మెల్యేలు ఉండాలి కానీ.. దివంగత మాజీ ప్రధాని పీవీ కుమార్తెను ఎన్నుకోవటానికి మాత్రం ప్రజలు ఉండాలా? ఇదెక్కడి న్యాయం సారూ? అంటూ జోరుగా షేర్ అవుతున్న పోస్టులు ఇస్తున్న సంకేతం ఏమిటి?