ఆ రాష్ట్రాన్ని పూర్తిగా శాఖాహార రాష్ట్రం మార్చేస్తారా .. ఏం జరుగుతోంది !

Thu Nov 25 2021 06:00:01 GMT+0530 (IST)

Will That State Become A Completely Vegetarian State

గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాంసాహారం అమ్మడంపై ఆంక్షలు విధిస్తోంది. ఈ ఆంక్షలను ప్రభుత్వం తీసుకున్నది అని కాకుండా స్ధానిక సంస్ధలు తీసుకున్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా మాంసాహారంపై స్ధానికంగా గొడవలు మొదలయ్యాయి. మాంసాహార వంటలను స్నాక్స్ ను అమ్మే రోడ్డుపక్క బండ్లు షాపులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గుజరాత్ మొత్తాన్ని శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలన్న అధికార పార్టీ ఆలోచనే దీనికి కారణమని సమాచారం. నిజానికి ఆహారమన్నది వ్యక్తిగత ఇష్టం. ఎవరు ఏ ఆహారం తీసుకుంటారన్నది పూర్తిగా వాళ్ళ ఇష్టమని అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలిసినా గుజరాత్ లోని స్వాధ్యాయ పరివార్ స్వామి నారాయణ్ సంస్ధల ముసుగులో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి.



ఆ సంస్థలకి తోడుగా బీజేపీ నేతలు కూడా కలవడం తో వ్యాపారులకు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. వడోదర రాజ్ కోట్ జూనాగడ్ భావ్ నగర్ మున్సిపాలిటి ప్రాంతాల్లో మాంసాహారం అమ్మే షాపులపైన రోడ్డు పక్కన మాంసాహార వంటకాలను అమ్మే బండ్లపైన వరుసబెట్టి దాడులు జరుగుతున్నాయి. దాంతో మాంసాహారం అమ్మే వాళ్ళు భయపడిపోయి తమ వ్యాపారాలను మూసేసుకున్నారు. వరుసదాడుల కారణంగా ఇపుడు పై ప్రాంతాల్లో చికెన్ మటన్ ఫిష్ ప్రాన్ లాంటి వంటకాలను అమ్మే షాపులు పెద్దగా కనిపించడం లేదు. తాజా పరిమాణాలతో మాంసాహార ప్రియులకు ప్రభుత్వంపై మండిపోతోంది. పై మున్సిపాలిటి ప్రాంతాల్లో అనధికారికంగా మాంసాహారం అమ్మే దుకాణాలపై దాడులు జరుగుతున్నాయని మాంసాహార విక్రయాలను నిషేధించారని జనాలు ప్రభుత్వంతో మొత్తుకున్నా పట్టించుకోవటంలేదు.

మాంసాహార అమ్మకాలపై నిషేధమంతా పూర్తిగా అనధికారికంగానే జరుగుతోంది కాబట్టే ప్రభుత్వం ఏమాత్రం స్పందించటంలేదు. పై రెండుసంస్ధలతో పాటు బీజేపీ నేతలపై మామూలు జనాలు మండిపోతున్నారు. తాము ఇదే ఆహారం తినాలని చెప్పేందుకు బీజేపీ నేతలకు అధికారంలేదని వాదిస్తున్నారు. కాకపోతే అధికారికంగా తీసుకున్న నిర్ణయం కాకపోవటంతో పార్టీ కూడా స్పందించటంలేదు. ఇలాంటి అనేక చర్యలతో బీజేపీపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. మాంసాహార అమ్మకాలను నిలిపేసే బదులు ఏరులై పారుతున్న మద్యాన్ని నియంత్రించాలంటు జనాలు చెప్తున్నారు.