లోకేష్ పాదయాత్ర అక్కడి నుంచా?

Sat Jul 20 2019 20:00:01 GMT+0530 (IST)

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు తనయుడు అధికారంలో ఉన్నంత కాలం ట్విట్టరుకే పరిమితం అయ్యారు. ఓటమితో పాఠాలు నేర్చుకున్నారో ఏమో ప్రజల్లో ఉండాలని ఇన్నాళ్లకు గ్రహించారు. అందుకే ప్రజలతో మమేకం అవడానికి ’పాదయాత్ర‘ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపై రెండు సందేహాలు జనాల్లో తిరుగుతున్నాయి. ఆయన పాదయాత్ర ఎంతకాలం చేస్తారు? ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి దాకా చేస్తారు అని. అయితే... తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... ఆయన తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకమైన హిందూపురం నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలుపెడతారని తెలుస్తోంది.లోకేష్ పాదయాత్ర గురించి చర్చ వచ్చిన వెంటనే సహజంగా అది ఎక్కడి నుంచి చేస్తే బాగుంటుందన్న ప్రస్తావన వస్తుంది. అన్నీ బేరీజు వేసుకున్నాక పాదయాత్ర ప్రారంభం ఘనంగా ఉండాలని దానికి ఈ నియోజకవర్గం అయితే బాగుంటుందని ఆలోచించారట. బాబు సొంత నియోజకవర్గం అయినా చంద్రబాబుకు మెజారిటీ తగ్గింది గానీ హిందూపురం మాత్రం చెక్కుచెదరకుండా తెలుగుదేశం వెంటే ఉంది. అందుకే పాదయాత్ర ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్టీరామారావు సెంటిమెంటును మళ్లీ రగిల్చి పాదయాత్ర కొనసాగించే యోచనలో ఉంది తెలుగుదేశం పార్టీ.

హిందూపురం నియోజకవర్గం నారా నందమూరి కుటుంబానికి పెట్టని కోట. ఒక సెంటిమెంటు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్కడ తెలుగుదేశం పార్టీయే గెలిచింది. 2019లో జగన్ ప్రభంజనంలోనూ హిందూపురం ప్రజలు తెలుగుదేశం పార్టీనే ఆదరించారు. లోకేష్ తాత అయిన ఎన్టీ రామారావు మూడు సార్లు వరుసగా అక్కడ పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ అక్కడ గెలిచారు. 2014 2019లో నందమూరి బాలకృష్ణ గెలిచారు. అయితే ఇక్కడో ట్విస్టు ఉంది. నందమూరి హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి ఇక్కడి నుంచి పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అందుకే తెలుగుదేశం పార్టీకి ఇది అత్యంత ప్రీతిపాత్రమైన స్థానంగా ఉంది.