Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆన్ డ్యూటీ.. మునుగోడు అభ్యర్థి మారతారా?

By:  Tupaki Desk   |   14 Aug 2022 4:30 PM GMT
కేసీఆర్ ఆన్ డ్యూటీ.. మునుగోడు అభ్యర్థి మారతారా?
X
తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తుంటారో అర్థం కాదు. ఆ మాటకు వస్తే ఆయనకు సంబంధించిన విషయాలు బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారో. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారికి తప్పించి.. మిగిలిన వారికి ఆయన తీరు మీద పెద్ద అవగాహన కూడా ఉండదు. సాధారణంగా ముఖ్యమంత్రులుగా వ్యవహరించే వారు నిత్యం సచివాలయానికి రావటం.. కొన్ని ప్రకటనలు చేయటం.. తరచూ మీడియాతో మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటారు.

ఆ మాటకు వస్తే ఎప్పుడు ప్రగతి భవన్ లో ఉంటారో.. ఎప్పుడు ఫామ్ హౌస్ అనబడే ఫార్మర్ హౌస్ లో ఉంటారో తెలీని పరిస్థితి. దీనికి తోడు ప్రతిది గుట్టుగా ఉంచటం ద్వారా ఆయనకు సంబంధించిన చాలా విషయాలు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసే వీలుంది.

అలాంటి ఆయన మునుగోడు ఉప ఎన్నిక విషయంలో మాత్రం ఆయన అందరికి తెలిసేలా కసరత్తు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మునుగోడు విషయంలో తాను ఆన్ డ్యూటీలో ఉన్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. తొలుత మునుగోడు బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నియమించే విషయంలో కేసీఆర్ సానుకూలంగా ఉన్న విషయం తెలిసిందే.

ఆయన సొంత మీడియాలోనూ కూసుకుంట్లే అభ్యర్థి అవుతారన్న సంకేతాల్ని ఇచ్చేలా వార్తలు రావటం తెలిసిందే. ఆయన అభ్యర్థిత్వం మీద వ్యతిరేకత వచ్చిన వెంటనే.. దాన్ని సర్దిచెప్పే కన్నా.. పార్టీ ప్రకటించిన వారే ఫైనల్ అన్నట్లుగా మాటలు రావటం.. దానితో వ్యతిరేకులు మరింత గట్టిగా తమ ప్రయత్నాలు షురూ చేయటంతోకేసీఆర్ తన తీరును మార్చారు. మొదట్లో మాదిరి కాకుండా.. అభ్యర్థి ఎంపిక విషయంలో తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు.. దానిపై కసరత్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు.

కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నేపథ్యంలో.. వ్యతిరేకుల జాబితాను తయారుచేసిన ఆయన.. అందులోని ముఖ్యులను ప్రగతిభవన్ కుపిలిపించుకొని మరీ మాట్లాడుతున్నారు. దీనికి తగ్గట్లే శనివారం ఆయన పలువురు నేతలతో భేటీ కావటమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. తక్కెళ్లపల్లి రవీందర్ రావు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్.. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.. ఆయన సోదరుడు క్రిష్ణారెడ్డిలతో కూడా మాట్లాడారు.

అంతేనా.. గతంలో గతంలో తాము సస్పెన్షన్ వేటు వేసిన సీనియర నాయకుడు వేనేపల్లి వెంకటేశ్వర్ రావును కూడా పిలిపించుకొని మాట్లాడటం చూస్తే.. మునుగోడు విషయంలో కేసీఆర్ ఆన్ డ్యూటీలో ఉన్నారన్న విషయం మరింత స్పష్టమవుతుందని చెప్పాలి. మొదట్లో త్వరపడి అభ్యర్థి విషయంలో సంకేతాలు ఇవ్వటం.. దానికి సంబంధించిన లొల్లితో మరింత అలెర్టు అయిన కేసీఆర్.. అందరితో మాట్లాడి.. వారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని డిసైడ్ చేసేందుకు వీలుగా తాజా ప్లానింగ్ జరుగుతుందని చెబుతున్నారు. సో.. మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ తాజా స్టేటస్.. 'ఆన్ డ్యూటీ' అని చెప్పక తప్పదు.