Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర దేశానికి ముప్పులా మారనుందా?

By:  Tupaki Desk   |   18 Jun 2020 7:30 AM GMT
మహారాష్ట్ర దేశానికి ముప్పులా మారనుందా?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. భారత్ లోనూ తన వీరంగాన్ని మరింత పెంచింది. లాక్ డౌన్ వేళ అంతో ఇంతో అదుపులో ఉన్నది కాస్తా.. అన్ లాక్ 1.0 మొదలైన నాటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మొదట్లో కేసుల సంఖ్య ఎలా ఉన్నా.. మరణాలు అదుపులో ఉన్నట్లుగా కనిపించింది. గణాంకాలు అదే విషయాన్ని స్పష్టం చేశాయి.

అందుకు భిన్నంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తే.. ఆందోళనకుగురి చేస్తున్నాయి. మరి ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి అంతకంతకూ తీవ్రమవుతోంది. దేశంలోని చాలా రాష్ట్రాల కంటే దారుణమైన పరిస్థితి ఇప్పుడా రాష్ట్రంలో నెలకొంది. బుధవారం ఒక్కరోజులోనే 3307 కొత్త కేసులు వెలుగు చూడగా.. ఒక్కరోజులోనే మరణించినవారి సంఖ్య 114 ఉండటం షాకింగ్ గా మారింది.

తాజా పాజిటివ్ లతో చూస్తే.. ఒక్క మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,752కు చేరుకోగా.. మరణాలు ఏకంగా 5651 కావటం గమనార్హ. దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఇప్పుడు మహారాష్ట్రలోనే చోటు చేసుకుంటున్నాయి. కేసుల నమోదు తీవ్రతను చూస్తే.. రానున్న రోజుల్లో మహారాష్ట్ర దేశానికి ముప్పులా మారుతుందా? అన్న సందేహం కలుగక మానదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మహారాష్ట్రలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అత్యధికం ముంబయి మహానగరంలోనే కావటం ఆందోళనకు గురి చేస్తోంది.

దేశ ఆర్థిక రాజధానిగా ఒక వెలుగు వెలిగిన ముంబయి.. ఈ రోజున శవాల దిబ్బగా.. ఏ మూల చూసినా మహమ్మారి ఛాయలే కనిపిస్తోంది. దీంతో.. భయం నీడన బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి ముంబయి మహానగర వాసుల్లో కనిపిస్తోంది. మాయదారి రోగానికి ముంబయిలో చెక్ చెప్పకుంటే.. భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదన్న హెచ్చరికలు జారీ అవుతున్నాయి.