జగన్ వ్యూహం వర్కవుటయ్యిందా ?

Mon Jul 26 2021 11:33:58 GMT+0530 (IST)

Is the Jagan strategy working?

ఢిల్లీలో పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.  మాట్లాడుకోవటానికి ఢిల్లీకి  రావాల్సిందిగా హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ వచ్చిందని సమాచారం. పార్టీ వర్గాల్లో ఫోన్ ఆహ్వానంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.  జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి రాష్ట్ర ప్రయోజనాలు+రాజకీయ ప్రయోజనాల విషయంలో కేంద్రంముందు చాలా డిమాండ్లే పెట్టారు. అయితే చాలావాటిని ప్రధానమంత్రి నరేంద్రమోడి అసలు లెక్కే చేయలేదు.ఏదో రాష్ట్రానికి రొటీన్ గా వచ్చే నిధులు తప్ప ప్రత్యేకించి ఏమీ ఇవ్వలేదనే చెప్పాలి. పైగా విభజన చట్టంలోని ప్రత్యేకహోదా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాలను నరేంద్రమోడి ఎప్పుడో తుంగలో తొక్కేశారు. జగన్ ఇదే విషయాన్ని సందర్భం వచ్చినపుడల్లా ప్రస్తావిస్తున్నా మోడి పట్టించుకోవటంలేదు. ఇక పోలవరం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు మూడు రాజధానుల అంశం లాంటివి కూడా కేంద్రం దగ్గర పెండింగ్ లోనే ఉన్నాయి.

ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలైతే తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయటం అమరావతి భూకుంభకోణంపై సీబీఐ విచారణ చేయించటం లాంటి రాజకీయపరమైన అంశాలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒకేసారి వైసీపీ ఎంపిలు విజృంభించారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో మొదటి రోజునుండి వైసీపీ ఎంపిలు ఉభయసభల్లో నానా రచ్చ చేస్తున్నారు. గడచిన రెండుళ్ళల్లో కేంద్రానికి మద్దతుగా నిలబడిన వైసీపీ నుండి ఇలాంటి వైఖరిని కేంద్రం పెద్దలు ఏమాత్రం ఊహించలేదు.

దాంతో పై విషయాలపై చర్చించేందుకు రావాలంటు అమిత్ నుండి జగన్ కు ఫోన్ వచ్చినట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు వచ్చేనెల 13వ తేదీవరకు జరుగుతాయి. మొన్నటి 19వ తేదీన మొదలైన సమావేశాలు ఒక్కటంటే ఒక్కరోజు కూడా సజావుగా జరగలేదు. వైసీపీ ఎంపిల గోల ఒకలాగుంటే మిగిలిన ప్రతిపక్షాల గోల పెగాసస్ వ్యవసాయ చట్టాల రద్దు పై పార్లమెంటు దద్దరిల్లిపోతోంది. ప్రతిపక్షాలు చేసే రచ్చను ఊహించిందే అయినా మద్దతుగా ఉన్న వైసీపీ కూడా గోల చేస్తుండటంపై మోడి ఆశ్చర్యపోయారట.

అన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకునే జగన్ను పిలిచి మాట్లాడటమని అమిత్ కు పురమాయించారట. మోడి దగ్గర నుండి ఆదేశాలు రాగానే అమిత్ వెంటనే జగన్ కు ఫోన్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెలాఖరులోగా జగన్ ఢిల్లీ టూర్ ఉంటుందని అంటున్నారు. మరి ఢిల్లీ టూరులో రాష్ట్ర ప్రయోజనాలు రాజకీయప్రయోజనాల్లో ఏవి పరిష్కారమవుతాయో చూడాల్సిందే.