రికార్డ్ కేసులు: దేశాన్ని మళ్లీ కరోనా ఆవహించనుందా?

Sat Jun 25 2022 16:11:21 GMT+0530 (IST)

Will Corona take over the country again?

కరోనా పీడ పోయిందని అందరూ మాస్కులు తీసేసి ఆహ్లాదంగా విహరిస్తున్న వేళ మళ్లీ ఆ మహామ్మారి కోరలు చాస్తుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కోవిడ్ -19 భారతదేశంలోని అనేక ప్రాంతాలలో మళ్లీ వ్యాప్తి చెందుతోంది.   దేశంలో కొత్త కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి.తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 15940 మంది కరోనా బారినపడ్డారు. అదే సమయంలో వైరస్ కారణంగా 20 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో దేశంలో ఇప్పటిరవకూ కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5.24 లక్షలు దాటింది.దేశాన్ని మళ్లీ కరోనా ఆవహిస్తోందా? కేసుల పెరుగుదల అదే సూచిస్తోందా? వర్షాకాలం వ్యాధుల సీజన్ లో 4వ వేవ్ దేశంలో వస్తుందా? అంటే కేసుల తీవ్రత చూస్తే అదే అనిపిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా  12425 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ కరోనా నుంచి సేఫ్ అయిన వారి సంఖ్య 4.27 కోట్లకు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 91779గా ఉంది. రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది.

చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ మాయదారి కరోనా తగ్గినట్టే తగ్గి చాపకింద నీరులా రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది.  కొత్త రూపంతో ప్రస్తుతం  ప్రపంచదేశాలను వణికిస్తోంది. మొన్నటి వరకూ ఉత్తరకొరియాను వణికించిన కరోనా తాజాగా ఫ్రాన్స్ ను దడ పుట్టిస్తోంది. కొత్త కొత్త వేవ్ లు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.ఫ్రాన్స్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ తాము కరోనా కొత్త వేవ్ ను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. కానీ కొత్త వేవ్ తీవ్రత ఎంత వరకూ ఉంటుందనేది మాత్రం చెప్పలేమన్నారు.

ఇప్పటికే అనేకదేశాల్లో కరోనా వైరస్ రూపాంతరం చెంది మరింత శక్తివంతంగా మారి వేరియంట్ లుగా విరుచుకుపడుతోంది. వైరస్‌లు ఎల్లప్పుడూ రోగనిరోధక శక్తి నుండి తప్పించుకోవడానికి కొత్త రకాలుగా మారుతుంటాయి. కొత్త రకం వైరస్ లుగా మారి దాడిచేస్తుంటాయి. ఓమిక్రాన్ గా మారిన తర్వాత కరోనా మరిన్న ఉప-వైరస్ రకాలుగా మారింది. డెల్టా వంటి ఇతర రూపాంతరాలు అందించిన దానికంటే ఒమిక్రాన్  తీవ్రత తక్కువగా ఉంది. ఎర్గో రీఇన్‌ఫెక్షన్ విషయంలో ఇది సర్వసాధారణంగా మారింది.

ప్రస్తుతం వ్యాక్సిన్లు వేయడంతో దేశం మొత్తం కరోనా నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. ప్రతిరోధకాలను కలిగి ఉండటం వల్ల ఒక వ్యక్తికి వ్యాధి సోకదని అర్థం కాదు. ఇప్పటికి మొదటి రెండవ మరియు మూడవ వేవ్ లను దేశం ఎదుర్కొంది. మూడో వేవ్ పెద్దగా ప్రభావం చూపలేదు. అదేవిధంగా తదుపరి వేవ్ మనల్ని తాకుతుందని భావిస్తున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఈ వర్షకాలం సీజన్ లోనే అది విజృంభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మూడు వేవ్ ల నుండి అనుభవించిన బాధలను పరిగణనలోకి తీసుకుంటే కేవలం నాలుగోవేవ్ విస్తరణ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

ఇంతలో రోజువారీ కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరగడం వల్ల తెలంగాణ ఆరోగ్య శాఖ ఫేస్ మాస్క్.. భౌతిక దూర నిబంధనలను తిరిగి విధించింది. "తెలంగాణలో ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. ఫేస్‌మాస్క్‌లు కోవిడ్-19కి వ్యతిరేకంగా రక్షణలో మొదటి నిరోధకాలుగా ఉన్నాయి.

ఇక దేశంలో ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడులో ఎక్కువ కేసులు వెలుగుచూశాయి.  ఆసుపత్రిలో చేరే కరోనావైరస్ రోగుల సంఖ్య ఇంకా తక్కువగా ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదని అధికారులు హామీ ఇచ్చారు. అయితే ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలని మరియు అన్ని భద్రతా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం  నొక్కి చెబుతోంది.