Begin typing your search above and press return to search.

కొండపల్లి ఎపిసోడ్ లో సూపర్ హీరో ‘శ్రీలక్ష్మీ’ని బాబు గుర్తిస్తారా?

By:  Tupaki Desk   |   25 Nov 2021 10:32 AM GMT
కొండపల్లి ఎపిసోడ్ లో సూపర్ హీరో ‘శ్రీలక్ష్మీ’ని బాబు గుర్తిస్తారా?
X
సమకాలీన రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లిపోవటం.. పదవి కోసం.. కాసుల కోసం తోపు నేతలే వెళ్లిపోతున్న పరిస్థితి.

ఇలాంటివేళ.. తాము అభిమానించే పార్టీ.. తమను పట్టించుకోకున్నా.. తమకు గుర్తించకున్నా.. టికెట్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేసినా.. పార్టీకి కష్టం వచ్చిన వేళ.. తాము ఉన్నామంటూ ముందుకు వచ్చే నేతలు ఎంతమంది ఉంటారు? ఎంతసేపటికి తమ గురించి మాత్రమే ఆలోచించటం తప్పించి.. పార్టీ గురించి ఆలోచించే నేతలు చాలా చాలా తక్కువగా ఉంటారు.

తాము నష్టపోయినా సరే.. తాము అభిమానించే పార్టీకి మంచి జరగాలని తపించే నేతలు చాలా అరుదుగా ఉంటారు. ఏపీ మొత్తం విపక్ష టీడీపీకి ప్రతికూల వాతావరణం నెలకొన్న వేళ.. ఎన్నికలు ఏవైనా సరే.. ఓటమి కేరాఫ్ అడ్రస్ గా మారిన వేళ.. అందుకు భిన్నంగా ‘కొండపల్లి’ మున్సిపాలిటీ టీడీపీ సొంతం కావటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఎన్నిక టీడీపీకి మనో ధైర్యాన్ని ఇవ్వటమేకాదు..ఒకింత సంతోషాన్ని కలిగించింది. అయితే.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ఎన్నికను అధికారికంగా వెల్లడించలేదు.

చేతులెత్తే విధానంలో ఎన్నిక జరగటం.. టీడీపీకి చెందిన ఛైర్మన్.. ఇద్దరు వైస్ ఛైర్మన్ల ఎంపిక పూర్తి అయినప్పటికీ.. కోర్టు నిర్ణయం పెండింగ్ లో ఉండటం కారణంగా.. తుది ఫలితాన్ని వెల్లడించలేదు.ఈ ఎన్నికకు సంబంధించి వాళ్లు హీరో.. వీళ్లు హీరో అన్న మాట వినిపిస్తోంది కానీ.. అసలుసిసలైన హీరో.. అది కూడా సూపర్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది కొరిమికొండ శ్రీలక్ష్మీనే అని చెప్పాలి.

ఇదేంది బాసూ..ఈమె పేరు ఎప్పుడూ విన్నదే లేదు. ఆమె ఎవరు? అన్న ప్రశ్న రావొచ్చు. కానీ.. ఆమె గురించి తెలిస్తే.. ఫిదా కావటమే కాదు.. తెలుగు దేశంలో ఇంతటి కమిట్ మెంట్ లీడర్ ఉన్నారా? అలాంటి వాళ్లను చంద్రబాబు గుర్తించటం లేదా? అన్న ప్రశ్నలు తలెత్తటం ఖాయం.

కొండపల్లి మున్సిపాలిటీలో అధికార వైసీపీ.. టీడీపీకి సమానమైన సీట్లు వచ్చాయి. అయితే.. స్థానిక ఎమ్మెల్యే వైసీపీ ఎక్స్ ఆఫీషియోగా నిలవటంతో ఒక ఓటు అధిక్యతతో ఉంటే.. ఎంపీ కేశినేని నాని తన ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించటంతో మళ్లీ ఇరు పార్టీల బలం సమానమైంది. ఇలాంటివేళ.. మరో మహిళ ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆమె టీడీపీకి మద్దతు ఇవ్వటంతో ఆ పార్టీకి చెందిన వారు ఛైర్మన్.. వైస్ ఛైర్మన్లుగా నిలిచారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థే కొరిమికొండ శ్రీలక్ష్మీ.

ఆమె ప్రత్యేకత ఏమంటే.. ఆమె కుటుంబం టీడీపీకి చెందిన వారు. అయితే. ఆమెకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో.. ఆమెను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపారు ఆమె కుటుంబ సభ్యులు. తమకున్న ఛరిష్మాతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు రెండు పార్టీలకు సమంగా రావటం.. కొండపల్లి మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలంటే శ్రీలక్ష్మీ ఓటు కీలకమైంది. ఇలాంటి వేళ.. అధికార వైసీపీకి చెందిన స్థానిక నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ తాను అభిమానించే టీడీపీకి నష్టం చేసే పని తాను చేయలేనిన ఆమె స్పష్టం చేశారు.

టికెట్ ఇవ్వని పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న లాజిక్ కు ఆమె ఫ్యామిలీ మెంబర్లు నో అంటే నో చెప్పేశారు. దీంతో.. ఇలా కాదని.. ఆమె పుట్టింటికి వెళ్లిన వైసీపీ నేతలు.. అటువైపు నుంచి విషయాన్ని నరుక్కొద్దామని ప్రయత్నించటమే కాదు.. ఆమె తమ పార్టీకి మద్దతు ఇస్తే అక్షరాల రూ.కోటి నజరానాగా ఇస్తామంటూ భారీ ఆఫర్ ఇచ్చారు.

దీనికి సైతం.. వారు నో అంటే నో అనటం విశేషం. తమ కుమార్తె..తమ అల్లుడు టీడీపీకి వీరాభిమానులని.. వారు మరే పార్టీకి మద్దతు ఇవ్వరని.. ఎంత ఆఫర్ చేసినా వారిలో మార్పు రాదని శ్రీలక్ష్మీ పుట్టింటి వారు చేతులు ఎత్తేసినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయటానికి టికెట్ ఇవ్వని ఒక స్థానిక నేత.. తన సొంత ఛరిష్మాతో గెలిచి.. హ్యాండ్ ఇచ్చిన పార్టీ కోసం రూ.కోటి ఆఫర్ కు నో చెప్పిన వైనం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

ఇలాంటి వీరాభిమానుల్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని.. ఆమెకు సముచిత స్థానం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి.. కొరిమికొండ శ్రీలక్ష్మిని చంద్రబాబు గుర్తిస్తారా? పార్టీకి ‘కాపు’ కాసిన ఈ కుటుంబానికి బాబు ఎలాంటి నజరానా ఇస్తారో చూడాలి.