టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించగలరా?

Sat May 21 2022 11:00:02 GMT+0530 (IST)

Will BJP and TDP Agree for Alliance?

ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా బీజేపీని సైతం ఒప్పిస్తా..ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన. మీడియాతో మాట్లాడిన పవన్ మనసులో ఉన్నదేమంటే వచ్చే ఎన్నికల్లో తమతో పాటు తెలుగుదేశంపార్టీని కూడా కలుపుకుని వెళ్ళాలని. నిజానికి పవన్ అజ్ఞానం ఇక్కడే బయటపడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా తమతో టీడీపీని కలుపుకున్నంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే ప్రతిపక్షాలుగా కాంగ్రెస్ వామపక్షాలు కూడా ఉన్నాయి.ప్రతిపక్షాల్లో దేనిబలం ఎంతని విశ్లేషిస్తే బీజేపీ కాంగ్రెస్ వామపక్షాల బలం సున్నాయే అని చెప్పాలి.  మొన్నటి ఎన్నికల జనసేన బలం 5.6 శాతంగా తేలింది. ఇదే ఓట్లశాతం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఉంటుందని కూడా చెప్పలేం.

ఇంతకన్నా పెరగచ్చు లేదా తగ్గవచ్చు. ఇక టీడీపీ బలం తీసుకుంటే సుమారు 35 శాతం ఉంటుంది. చరిత్రను తీసుకుంటే టీడీపీ బలం సగటున 35 శాతం కచ్చితంగా ఉంటుందని అనుకోవచ్చు.

కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాల బలమంటే అది టీడీపీ బలమనే అర్ధం చేసుకోవాలి. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుకు బీజేపీ నేతలు ఏమాత్రం ఒప్పుకోవటంలేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని తీసుకోవాల్సింది నరేంద్రమోడీ మాత్రమే.

మరి మోడీని ఒప్పించేంత సీన్ పవన్ కు ఉంటుందని ఎవరు అనుకోవటంలేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే లాభం ఉంటుందా లేదా అన్న విషయాన్ని బీజేపీ భేరీజు వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. అంతేకానీ పవన్ చెప్పారని చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ సిద్ధపడదు.

ఎందుకంటే చంద్రబాబు గురించి పవన్ కన్నా బీజేపీ అగ్రనేతలకే ఎక్కువ తెలుసు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటే పార్టీకి కచ్చితంగా లాభమని అగ్రనేతలు గ్రహిస్తే ఎలాంటి మొహమాటాలు లేకుండా వెంటనే మోడి పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారనటంలో అనుమానం లేదు. కాబట్టి టీడీపీని కలుపుకుని వెళ్ళటంలో పవన్ తన ప్రయత్నాలను వెంటనే మొదలుపెట్టడమే మంచిది. అయితే మోడీపై ఒత్తిడి పెట్టి టీడీపీతో పొత్తుకు పవన్ ఒప్పించగలరా ?